కృత్రిమంగా పండ్లు మగ్గపెడితే జైలే

3 Mar, 2016 03:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వినియోగించి కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. కాల్షియం కార్బైడ్ వినియోగంతో జరిగే అనర్ధాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, రూ.లక్ష జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో ఫిబ్రవరి 18న దాడులు జరిపి, పండ్ల నమూనాలను నాచారం ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు. 73 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. పండ్లను మగ్గ పెట్టేందుకు రూ.60 లక్షల వ్యయంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో ఇథిలీన్ చాంబర్‌ను మార్కెటింగ్ శాఖ నిర్మిస్తున్నదన్నారు.  కాల్షియం కార్బైడ్ అనర్ధాలపై ఐపీఎం డైరక్టర్ శివలీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ఐ అండ్ పీఆర్ డిప్యూటీ డైరక్టర్ నాగయ్య కాంబ్లే కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు