రెండు రోజుల్లో నగారా | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో నగారా

Published Thu, Mar 3 2016 3:10 AM

Tamil Nadu Elections 2016

 చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజకీయ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్‌జైదీ మంగళవారం తుదివిడత చర్చలు జరుపుతున్న తరుణంలో నోటిఫికేషన్ జారీ చేస్తారని ఢిల్లీ వర్గాల భోగట్టా.   తమిళనాడు ప్రభుత్వానికి మే 22వ తేదీతో గడువు ముగుస్తుంది. ఈ లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తిచేసి కొత్త ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది. ఇందుకోసం ఎన్నికల కమిషనర్ ఏర్పాట్లపై తలమునకలై ఉన్నారు. ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన యంత్రాలు ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు చేరుకున్నాయి.
 
 నకిలీ ఓటర్ల తొల గింపు కార్యక్రమం గత నెల 15 నుంచి 29వ తేదీ వరకు సాగింది. బందోబస్తుకు సీఆర్పీఎఫ్ దళాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 65వేల పోలింగ్ కేంద్రాల్లో 38 వేల కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి వెబ్‌కెమెరాలను అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇలా అన్ని రకాల పనులను నూరుశాతం పూర్తి చేసిన దశలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందరిలానే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎదురుచూస్తోంది. రాష్ట్రంలోని ఎన్నికల అధికారులందరికీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్‌లఖానీ మంగళవారం అత్యవసర ఉత్తరాలు పంపారు. నోటిఫికేషన్ వెలువడగానే కొత్తగా ప్రభుత్వ పథకాలను ప్రకటించరాదు, అమలు చేయరాదని ఆ ఉత్తరం ద్వారా ఆదేశించారు.
 
 అలాగే సీఎం జయలలిత సైతం సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని పథకాల ప్రచార చిత్రాలను వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా హడావిడిగా విడుదల చేశారు. సోమవారం ప్రారంభించిన అనేక పథకాలు, నిర్మాణాలు అసంపూర్తిగా ఉండగానే ప్రారంభించడం సీఎం హడావిడితనానికి అద్దం పట్టింది. ఇందువల్ల ఎన్నికల తేదీ ముఖ్యమంత్రికి ముందే చెప్పి ఉంటారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇటువంటి సంకేతాల కారణంగా బుధ, గురువారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం ఖాయమని తెలుస్తోంది. ‘ఎన్నికల తేదీపై నిర్ణయం జరిగిపోయింది, ఈ నెల 4వ తేదీ సాయంత్రం లేదా 5 వ తేదీ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది’ అని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు రహస్య సమాచారం ఇచ్చారు.
 
 ఈసీకి డీఎంకే విజ్ఞప్తి  
 ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ సాగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులను నియమించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్‌లఖానికి డీఎంకే విజ్ఞప్తి చేసింది. పార్టీ లీగల్‌సెల్ సహాయ కార్యదర్శి పరంధామన్ మంగళవారం సచివాలయంలో ఈసీని కలిశారు. గత  పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎన్నికల కమిషన్ 144 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో అధికార అన్నాడీఎంకే, పోలీసులు తమకు అనుకూలంగా మలచుకున్నారని ఆరోపించారు. ఇటువంటి తప్పిదాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులను పరిశీలకులుగా నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
Advertisement