పోలవరం నిర్మాణం నిలిపి వేయాలి

30 May, 2014 01:53 IST|Sakshi

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మోడం వెంకన్న, హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా డిమాండ్ చేశారు.ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా షెడ్యూల్డ్ ప్రాంతంలో బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టే అధికారం ఏ పాలకులకూ లేదన్నారు. పీసా, అటవీ హక్కుల చట్టాలు, 1/70 యాక్టుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. గిరిజన హక్కులకు రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాల్సిన రాష్ట్రపతి  హక్కుల ఉల్లంఘనకు పచ్చజెండా ఊపటం అప్రజాస్వామికమన్నారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు నాయకత్వంలో కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరేలా మోడీ సర్కారు నిర్ణయం తీసుకుందని విమర్శించారు.

 దేశం కోసం ప్రాణం అర్పిస్తానని చెప్పిన మోడీ రెండు లక్షల మంది  ఆదివాసీల మనుగడను  జలసమాధి చేయడం దారుణమన్నారు. తెలంగాణకు టీడీపీ, బీజేపీ ద్వారానే న్యాయం జరుగుతుందని ప్రగల్భాలు పలుకుతున్న ఆ పార్టీ నాయకులు పోలవరంపై సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పోలవరం  ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీల పోరాటానికి  మద్దతుగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో  వెంకట్, చిర్రా రవి, శంకర్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు