సవాలే!

28 Aug, 2019 12:10 IST|Sakshi
బాధ్యతలు స్వీకరిస్తున్న లోకేష్‌కుమార్‌

కొత్త కమిషనర్‌కు సమస్యల స్వాగతం

నిధుల లేమి..యంత్రాంగం కొరత

ఎస్సార్డీపీ, రోడ్లు, నాలాలు, పారిశుధ్యం, డబుల్‌ ఇళ్ల నిర్మాణంపైనే అందరి దృష్టి

ఈ ప్రాజెక్టుల పూర్తి ఆషామాషీ కాదు...

బాధ్యతలు స్వీకరించిన లోకేష్‌కుమార్‌

అభినందనలు తెలిపిన మేయర్‌

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఎవరున్నా అది కత్తిమీద సామే. ఓవైపు అధ్వానపు రహదారులు.. ఎంత చేసినా కనిపించని పారిశుధ్యం.. వీధుల్లో కనిపించే చెత్తకుప్పలు. ఇది ఒకవైపు దృశ్యం. మరోవైపు ఇప్పటికే  చేపట్టిన భారీ ప్రాజెక్టులు. వాటికి అడుగడుగునా ఎదురవుతున్న ఆటంకాలు.. నిధుల లేమి.. పూర్తికాని భూసేకరణ.. యుటిలిటీస్‌ షిఫ్టింగ్‌. ఇంకోవైపు 150 మంది కార్పొరేటర్లతో సహా 200 మందికి పైగా వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, వారి డిమాండ్లు. వీటన్నింటినీ క్రోడీకరించుకొని ఇబ్బందుల్లేకుండా పరిపాలన సాగించడం ఎవరికైనా కష్టమే. జీహెచ్‌ఎంసీకి కొత్త కమిషనర్‌గా మంగళవారం బాధ్యతలు చేపట్టిన లోకేశ్‌కుమార్‌ వీటిని ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే.  – 6లోu

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో ఉన్న మేజర్‌ ప్రాజెక్టు ఇప్పుడు ఎస్సార్‌డీపీ పథకం. దీని కింద చేయాల్సిన మొత్తం పనులు రూ.25 వేల కోట్లు కాగా, ప్రస్తుతం దాదాపు రూ.7 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిల్లో భూసేకరణ క్లిష్ట సమస్యగా ఉంది. ప్రాజెక్టు పనులతో పాటు భూసేకరణకు అవసరమయ్యే నిధులు కూడా ఎక్కువే. అయినప్పటికీ, ఇప్పటి వరకు ఈ పనులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేదు. వీటిని చేపట్టేప్పుడే ప్రభుత్వం కూడా ఆవిషయం స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ నిధులతోనే వీటిని పూర్తిచేయాలి. అందుకుగాను అప్పులకు వెళ్తున్నారు. బాండ్ల ద్వారా ఇప్పటికే దాదాపు రూ.500 కోట్లు సేకరించారు. వీటి వడ్డీలు, అసలు చెల్లింపులతో ఖజానా పరిస్థితి దిగజారుతోంది. మరిన్ని అప్పులు చేయనిదే పనులు కదలవు. అప్పులు చేస్తే జీతాల చెల్లింపులు కూడా కష్టమయ్యే పరిస్థితి.

పారిశుధ్యం..
ఎవరొచ్చినా.. ఎంత చేసినా పారిశుధ్యం మెరుగుపడటం లేదు. ఏటా దాదాపు రూ. 200 కోట్లు ఖర్చవుతున్నా ఫలితం కనిపించడంలేదు. ఈ పరిస్థితి నివారణకు  దానకిశోర్‌  ఆస్కి సహకారంతో  ‘సాఫ్‌ హైదరాబాద్‌– షాన్‌దార్‌ హైదరాబాద్‌’ పేరిట కొత్త ప్రణాళికలు రూపొందించారు. వార్డుల వారీగా పరిస్థితి మెరుగుపరచేందుకు సిద్ధమైనా కార్యక్రమం ఆరంభదశలోనే  ఉంది. దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయినా ప్రజల్లో అవగాహన రానిదే ఎంత చేసినా ఫలితం కనిపించే పరిస్థితి లేదు.

రోడ్లు అధ్వానం..
రోడ్లదీ అదే దుస్థితి. ఏటా రూ. 500 – 800 కోట్లు ఖర్చు చేస్తున్నా రోడ్లు మెరుగవడంలేవు. ప్రజలనుంచి విమర్శలు తప్పడం లేవు. వానొస్తే రోడ్లు చెరువులయ్యే పరిస్థితి నివారించేందుకు ఇటీవల జేఎన్‌టీయూ సహకారంతో ఇంజెక్షన్‌బోర్లు, తదితర చర్యలకు సిద్ధమయ్యారు.  అవి కూడా ప్రారంభదశలోనే ఉన్నాయి. రోడ్లకు ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో శాశ్వత పరిష్కారం లభించడం లేదు. శాశ్వతంగా పరిష్కరించాలంటే వేల కోట్లు కావాలి. అంత సొమ్ము జీహెచ్‌ఎంసీ వద్ద లేదు. ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు.

నాలాలదీ అదే పరిస్థితి
నాలాల ఆధునీకరణకు అడుగడుగునా అడ్డంకులు. వానొస్తే విస్తరించాలనే ప్రజాప్రతినిధులే ఆ తర్వాత విస్తరణ పనులకు అడ్డుపడుతున్నారు. గడచిన ఐదేళ్లలో దాదాపు రూ. 450 కోట్ల పనులుచేశారు. మరో రూ. 150 కోట్ల పనులు పురోగతిలోఉన్నాయి. భూసేకరణ జరగకపోవడం.. ప్రజాప్రతినిధులు అడ్డుపడుతుండటం తదితర కారణాలతో ఈ పనులను తమనుంచి తప్పించాల్సిందిగా సంబంధిత విభాగం కమిషనర్‌కు వినతి చేసుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా వివిధ సమస్యలతో ప్రాజెక్టులు కుంటుతుండగా, మ్యుటేషన్లు,  ఎక్కువ ఆస్తిపన్ను విధింపు, వీధికుక్కల బెడద, భవననిర్మాణ అనుమతుల్లో అవినీతి వంటి ప్రజాసమస్యలు నిత్యకృత్యంగా మారాయి. వీటిని పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ వద్ద తగిన యంత్రాంగం కానీ, అవసరమైన నిధులుకానీ లేవు. పనుల పర్యవేక్షణ విషయంలోనూ లోపాలున్నాయి.  ఈ నేపథ్యంలో లోకేశ్‌కుమార్‌ ఎలా నెగ్గుకురాగలరోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డబుల్‌  బెడ్‌రూమ్‌ ఇళ్లు..
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు పురోగతిలో ఉన్నా నిధుల లేమితో జాప్యం జరుగుతోంది. మరోవైపు పూర్తయిన దాదాపు పదివేల ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయక వాటికి కాపలా కాయడం కూడా కష్టమవుతోంది. ఇప్పటి వరకు వీటికోసం దాదాపు రూ. 4300 కోట్లు ఖర్చు కాగా, దాదాపు రూ. 400 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు