నిండు గర్భిణి పురిటి కష్టాలు

6 Apr, 2020 03:49 IST|Sakshi
దుకాణం ఎదుట కూర్చున్న స్వప్న

ప్రసవం కోసం వస్తే రిపోర్టులు లేవని వైద్యం నిరాకరించిన వైద్య సిబ్బంది

రాత్రంతా దుకాణం ఎదుట జాగారం

కొందుర్గు: కరోనా వైరస్‌ విజృంభణతో ఓ వైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న పరిస్థితుల్లో బాధ్యతతో ఓ వైపు ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది...మరోవైపు నిండు గర్భిణికి పురిటినొప్పులొస్తే రిపోర్టులు లేవన్న సాకుతో వైద్య సిబ్బంది వైద్యం చేసేందుకు నిరాకరించి ఆమెను రాత్రంతా ఆరుబయటే జాగారం చేయించింది. కొందుర్గు మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్న వడ్డె స్వప్న ఉగాది పండుగ కోసం జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలోని ఎదిర గ్రామంలోని తన పుట్టింటికి వచ్చింది. నిండు గర్భిణి అయిన ఆమెకు శనివారం రాత్రి 12 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబీకులు తరలించారు.

ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏఎన్‌సీ రిపోర్టులు చూపించాలని స్వప్నను అడుగగా తమ వద్ద లేవని చెప్పింది. రిపోర్టులు తన అత్తగారింట్లో ఉన్నాయని చెప్పినా ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు. రిపోర్టులు లేకుంటే వైద్యం చేయమని చెప్పి కనీసం ఆస్పత్రిలోనికి కూడా అనుమతించకపోవటంతో చేసేదేమీలేక స్వప్న తన మూడేళ్ల కుమారుడు, తల్లి యాదమ్మతో కలిసి పీహెచ్‌సీ వద్ద ఉన్న ఓ దుకాణం ఎదుట రాత్రంతా జాగరణ చేసింది. ఆదివారం ఈ విషయమై స్థానికులు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా..స్వప్న ప్రసవానికి ఇంకా సమయం ఉందని, పీహెచ్‌సీలో పేషెంట్‌తోపాటు మరొకరు మాత్రమే ఉండాలని సూచించగా గర్భిణితోపాటు కుటుంబీకులు బయటకు వెళ్లారని స్టాఫ్‌నర్స్‌ సలోమి తెలిపారు. అనంతరం కుటుంబీకులు స్వప్నను షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు