ఆరోగ్యం + ఆదాయం = చిరుధాన్యాల సాగు 

18 Mar, 2019 17:28 IST|Sakshi
బాదేపల్లిలో రైతు రవిశంకర్‌ సాగుచేస్తున్న అండుకొర్రలు

బాదేపల్లిలో ‘అండుకొర్రలు’ సాగుచేస్తున్న రైతు 

 ఏడాదికి  మూడు పంటలు  తీసే ఆస్కారం 

సాక్షి, జడ్చర్ల టౌన్‌: 
ఆరోగ్యంతోపాటు మంచి ఆదాయాన్ని ఇస్తుంది చిరుధాన్యాల సాగు. ఇటీవల కాలంలో చిరుధాన్యాలను భుజించటం సర్వసాధారణమైంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరగకుండా ఉంది. ఈక్రమంలోనే బాదేపల్లి పట్టణానికి చెందిన బి.రవిశంకర్‌ అనే ఆదర్శరైతు మాత్రం చిరుధాన్యాలను సాగుచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇప్పటికే పంట సాగుపట్ల అనేక ప్రయోగాలు చేయడంతోపాటు జడ్చర్ల రైతుసహకార సంఘం అధ్యక్షుడిగా పలు సెమినార్‌లకు హాజరై నూతన సాగు విధానాల పట్ల ఆయన మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే చిరుధాన్యాలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా పొలంలో అండుకొర్రలు సాగుచేస్తున్నాడు.  

డ్రిప్‌ పద్ధతిలో సాగు.. 
తక్కువ నీటితో డ్రిప్‌ పద్దతిలో అండుకొర్రలు సాగుచేయటం గమనార్హం. 65రోజుల కిందట విత్తనాలు వేయగా మరో 25రోజుల్లో పంట చేతికిరానుంది. ఇప్పటి వరకు ఎకరా అండుకొర్రల సాగుకు మొత్తం రూ.20వేలు ఖర్చు అయినట్లు సదరు రైతు తెలిపాడు. పంట దిగుబడి 7–8క్వింటాళ్ల వరకు రావచ్చని చెబుతున్నాడు. బహిరంగ మార్కెట్‌లో అండుకొర్రలు కిలో రూ.250గా ఉంది. 7–8క్వింటాళ్ల సాగుతో రూ.లక్షల్లో లాభాలు ఆర్జించేందకు ఆస్కారం ఉందంటున్నాడు.

గత ఏడాది చిరుధాన్యాలైన అర్కలు, సామలు, ఊదలు,  కొర్రలు, అండుకొర్రలు ఐదు రకాలను సాగుచేసి వచ్చిన 8క్వింటాళ్ల దిగుబడి అలాగే భద్రపర్చారు. ఏడాదికి మూడు పంటలు సులువుగా తీసే ఆస్కారం ఉండటంతో చిరుధాన్యాల సాగుపట్ల ఆసక్తి క్రమక్రమంగా పెరుగుతుంది.  

ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఉంటే సాగువిస్తీర్ణం పెరిగే అవకాశం 
చిరుధాన్యాలు పండించిన తరువాత వాటిని ప్రాసెసింగ్‌ చేసేందుకు జిల్లాలో అవకాశం లేకుండా పోయింది. ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటయినట్లయితే రైతులు మరికొంత మంది చిరుధాన్యాల సాగు చేసేందుకు సిద్దంగా ఉన్నారు.  

పట్టించుకోని ఐఐఎంఆర్‌సీ 
రాజేంద్రనగర్‌లో ఉన్న కేంద్ర ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధికారులు పట్టించుకోకపోవటం వల్లే ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కాకుండా ఉంది. 
చిరుధాన్యాల విత్తనాలు సరఫరా చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులు పండించిన చిరుధాన్యాలను నేరుగా విక్రయించలేక, ప్రాసెసింగ్‌ చేసుకోలేక సాగుకు ముందుకు రాకుండా ఉన్నారు. ఈప్రాంతంలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని, అందుకు ఐఐఎంఆర్‌సీ అ«ధికారులు ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు.  
  
ఎకరాకి రూ.20వేలు వెచ్చించి.. 
అండుకొర్రల సాగుకు ఇప్పటి వరకు ఒక ఎకరా పొలానికి రూ.20వేలు వెచ్చించా. మరో 25రోజుల్లో పంట చేతికి రానుంది. ఎకరాకు 7–8క్వింటాళ్ల దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. చిరుధాన్యాలు పండించేందుకు నీటి వసతి నామమాత్రంగా ఉన్నప్పటికీ డ్రిప్‌తో  సులువుగా సాగు చేయవచ్చు. ఏడాదికి మూడుపంటలు సులువుగా సాగు చేసే వెసులుబాటు ఉంది. చిరుధాన్యాల సాగు వల్ల భూమిలో సారం కోల్పోకుండా మరింత బాగా మారుతుంది. అయితే, రైతులు సాగుకు ఆసక్తిగా ఉన్నా ప్రాసెసింగ్‌ యూనిట్‌ లేకపోవటంతో ముందుకు రావడంలేదు.   – బి.రవిశంకర్, ఆదర్శరైతు, బాదేపల్లి   

మరిన్ని వార్తలు