ఇంటింటికీ వెళ్లి.. తలుపు తట్టిన మంత్రి

11 Mar, 2020 10:01 IST|Sakshi

 తడి, పొడి చెత్తపై అవగాహన కల‍్పించి..

చెత్తను వేరు చేసే ప్రక్రియను వివరిస్తూ..

మున్సిపల్‌ వార్డుల్లో మంత్రి పర్యటన

 సాక్షి, సిద్దిపేట : ఇంటింటికీ వెళ్లి తడి,పొడి చెత్త విభజనపై ఆరా తీస్తూ, మున్సిపల్‌ ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని వివరిస్తూ బల్దియాకు సహకరించాలని సూచిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం రెండో రోజు సిద్దిపేటలో పారిశుధ్య సిబ్బంది తరహాలో ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేశారు. స్థానిక 1వ వార్డులోని బారాయిమామ్, ఎల్లమ్మ దేవాలయం, రాంనగర్, తదితర ప్రాంతాల్లో సుమారు రెండు గంటలపాటు మార్నింగ్‌ వాక్‌ చేపట్టారు. కొన్ని చోట్ల నివాసగృహాల తలుపులు మూసి ఉండడంతో తలుపు కొట్టి మరీ ఇంటి యజమానులకు అవగాహన కల్పించారు. వార్డులో పర్యటిస్తున్న క్రమంలో మహిళలతో ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియ, మున్సిపల్‌ సిబ్బంది పనితీరు, పారిశుధ్య వాహనాల వేళలు గురించి ఆరా తీశారు.

కొన్ని చోట్ల మురుగు కాలువల్లో చెత్త చెదారం, ఖాళీ బహిరంగా ప్రదేశాల్లో సమీప నివాసగృహాల చెత్త కుప్పలను చూసిన మంత్రి సంబంధిత గృహాల మహిళలను పిలిచి స్వచ్ఛతపై అవగాహన కల్పించడంతో పాటు మన ఆరోగ్యంతో పాటు కాలనీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని సున్నితంగా సూచించారు. పలుచోట్ల కాలనీ ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టి తీసుకురాగా వెంటనే ఉన్న చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డిలకు సిఫారస్‌ చేసి పరిష్కారించాలని ఆదేశించారు. రాంనగర్‌ చౌరస్తా నుంచి ఎల్లమ్మ దేవాలయం వరకు హరీశ్‌రావు కాలినడకన వార్డు బాట çపట్టారు. మార్గ మధ్యలో మురికి కాలువలను పరిశీలించారు. విద్యుత్‌ తీగలను సరి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని సంబంధిత çస్థలాల యాజమానులకు సూచించారు.  

జకీర్‌... గజ్వేల్‌లో కూడా చేయాలి.. 
సిద్దిపేటలో వారంలో ఐదు రోజులు తడి, రెండు రోజలు పొడి చెత్తను సేకరిస్తున్నాం. ముందుగా ప్రజలకు తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని వివరిస్తున్నాం. నేను, మా కౌన్సిలర్లు, అధికారులు గల్లీలో ఇళ్లు ఇళ్లు తిరిగి చెప్పుతున్నాం. మీరు కూడా గజ్వేల్‌లో ఇదే తరహాలో వార్డులో తిరగండి. ప్రజలను చైతన్యం చేయండి. స్వచ్ఛ గజ్వేల్‌ సాధనకు కృíషి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో గజ్వేల్‌ మున్సిపల్‌ పాలకవర్గానికి సూచించారు. 1 వార్డులో పర్యటిస్తున్న క్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీర్‌తో పాటు కౌన్సిలర్‌లు వచ్చారు. వారికి కొంత దూరం వరకు తనవెంట పర్యటనలో తీసుకెళ్లి తడి పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని చూపించారు.  

పారిశుధ్య సిబ్బంది తరహాలో క్లాస్‌... 
స్థానిక 1వ వార్డులోని పలు కాలనీల్లోని ప్రజలు పారిశుధ్య వాహనానికి చెత్తను అందించడానికి రావడం, వాహనం వెంటే ఉన్న మంత్రి హరీశ్‌రావు మహిళల వద్ద నుంచి చెత్త డబ్బాలను తీసుకుని పరిశీలించారు. మున్సిపల్‌ ఆదేశాలకు అనుగుణంగా వారంలో ఐదు రోజులు తడి చెత్త సేకరణ నేపథ్యంలో మంగళవారం మంత్రి పర్యటన సందర్భంగా మహిళలు తెచ్చిన తడి చెత్తను క్షుణ్ణంగా పరిశీలించారు. కొందరు మహిళలు తెచి్చన చెత్త బుట్టల్లో ప్లాస్టిక్‌ కవర్లు ఇతరాత్ర ఉండడం పట్ల వాటిని స్వయంగా మంత్రి హరీశ్‌రావు చేతికి గ్లౌజ్‌ ధరించి దగ్గరుండి వేరు చేసి చూపించారు. ప్రతి రోజూ తడి చెత్తను మాత్రమే ఇవ్వాలని మహిళలకు హితవు పలికారు. ఆయన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, వెంట అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాయిరాం, కౌన్సిలర్లు బర్ల మల్లిఖార్జున్, స్వప్న బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు