రాములు వచ్చేదెట్టా?

9 Aug, 2018 12:45 IST|Sakshi
పెద్దరాములు, ఇతడి గురించి రాజస్తాన్‌ పత్రికలో వార్త.. 

అదృశ్యమైన ఏడాదికి రాజస్తాన్‌లో ప్రత్యక్షం

సోషల్‌ మీడియా ద్వారామతిస్థిమితం లేని వ్యక్తి ఆచూకీ లభ్యం

సత్తుపల్లి : మతి స్థిమితం సరిగ్గా లేక, మూగ, చెవిటి వైకల్యంతో ఉన్న ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కంచపోగు పెద్దరాములు అదృశ్యమై ఏడాది కాలం తర్వాత..అతను రాజస్తాన్‌ రాష్ట్రంలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చక్కర్లు కొట్టడంతో ఇక్కడి కుటుంబ సభ్యులు అతడిని రప్పించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.

పేద కుటుంబానికి చెందిన ఇతను అవివాహితుడు. 70 ఏళ్ల వయస్సులో..గతేడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు చాలా చోట్ల వెతికినా ప్రయోజనం కన్పించలేదు. అప్పట్లో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. శుభకార్యాల్లో వంటలు చేస్తూ జీవించేవాడు. అయితే..పరిశుభ్రత అంటే..చాలా ఇష్టమని, ఎక్కడ చిన్న చెత్తకాగితం కనిపించినా తీసి పక్కకు వేస్తుంటాడని, శుభకార్యాలప్పుడు వచ్చి పరిసరాలను పరిశుభ్రం చేస్తుంటాడని, స్థానికంగా సుపరిచితుడని ఇక్కడివారు చెబుతున్నారు.

ఈక్రమంలో రెండురోజుల క్రితం సోషల్‌ మీడియాలో పెద్దరాములు రాజస్తాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ ప్రాంతలో ఉన్నట్లు వచ్చింది. రాజస్తాన్‌ పత్రికలో తన వారి కోసం వృద్ధుడి ఆరాటం.. పేరిట కథనం కూడా ప్రచురితమైంది. తెలుగువాడు అయినందున సోషల్‌ మీడియాలో తెలుగు వాళ్లందరికీ పోస్టు చేశారు. ఈ ప్రాంతంలోని కొందరు గుర్తించడంతో పెద్దరాములు రాజస్తాన్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో ఉన్నట్లు వెలుగుచూసింది.  

కలెక్టర్, సీపీకి వినతి.. 

రాజస్తాన్‌ రాష్ట్రం నుంచి కంచపోగు పెద్దరాములును తీసుకొచ్చేందుకు సహకారం అందించాలని బంధువులు కలెక్టర్‌ లోకేష్‌కుమార్, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌లను కలిసి వేడుకున్నారు. అక్కడి అధికారులతో మాట్లాడి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దరాములును అప్పగించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు