మల్లన్న సన్నిధిలో.. మహాపచారం!

15 Dec, 2016 03:00 IST|Sakshi
మల్లన్న సన్నిధిలో.. మహాపచారం!

ఎల్లమ్మగుట్ట మీద జంతు బలులకు సన్నాహాలు
- అరిష్టమని చెబుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
- రూ.30 లక్షలతో జంతుబలి, వంటషెడ్ల నిర్మాణం  
- భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే


సాక్షి, సిద్దిపేట: మల్లన్న సన్నిధిలో మహా అపచారం జరగబోతోంది. ఎల్లమ్మ తల్లికి మాంసాహార నైవేద్యం సమర్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 500 ఏళ్లుగా పసుపు బండారిని నుదుట దిద్దుకున్న భక్తులు.. ఇకపై అదే నుదుటి మీద నెత్తుటి తిలకం దిద్దుకోవాల్సి వస్తోంది. ఎల్లమ్మ తల్లికి రక్తతర్పణం మహా పాపం అని, ఇంద్రకీలాద్రికి ఎనిమిది దిక్కుల అష్ట భైరవులు క్షేత్ర పాలకులుగా ఉన్నారని, ఇక్కడ జంతు బలి ఇవ్వటం మహా అపచారం, అరిష్టమని వేద పండితులు, ఆలయ అర్చకులు చెబుతున్నా అధికారులు వినిపించుకోవడం లేదు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో వీరశైవ ఆగమశాస్త్రం  ప్రకారం లింగ బలిజలు అర్చన చేయగా. ఒగ్గు పూజారులు పట్నం వేసి, మణ్మ య పాత్రతో నివేదనం సమర్పిస్తారు.

బెల్లం పొంగలి..పసుపు బువ్వ , టమాట, చిక్కుడుకాయ కూర ఇదే మల్లన్న ఇష్ట నైవేద్యం. మల్లన్నకు తలాపునే ఉన్న ఆయన చెల్లి ఎల్లమ్మ తల్లికి కూడా బెల్లం పొంగలి, పసుపు బువ్వే నైవేద్యంగా చెల్లిస్తారు. ఇది తరతరాల ఆచా రం. ఇప్పుడా ఆచారం అపచారం కాబోతోంది. ఇదంతా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సారధ్యంలో చేస్తున్నారు. కొండమీద మల్లన్న తలాపునే ఉన్న ఎల్లమ్మ గుడివద్ద రూ.30 లక్షలతో జంతు బలిపీఠం షెడ్డు, వంటశాల షెడ్డు నిర్మాణాలు చేపట్టారు. గుట్ట కింద భాగం నుంచి నేరుగా వాహనాలు వెళ్లటం కోసం దాదాపు 300 మీటర్ల పొడవైన బీటీ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. మల్లికార్జునస్వామి క్షేత్రం పడమర (చూపు)తో పడమటి శివాలయంగా ఉండడంతో ఈ క్షేత్రంలో పూజలు చేస్తే స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా జరుగుతుం దని భక్తులు చెప్పుకుంటారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయం చుట్టు అష్టభైరవులు కాపాలాగా ఉండి అందులో ఒకటి ఆలయ గర్భగుడిలో ఉండడంతో ఇక్కడ భక్తులు పూజలు చేస్తే దుష్టశక్తుల నుంచి మల్లన్న, భైరవులు కాపాడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మల్లికార్జునస్వామి క్షేత్రం 10వ ,11వ శతాబ్దంలో, కాకతీయుల కాలంలో సుమారు 500 సంవత్సరాల క్రితం వెలసినట్లు స్థల పురాణలు చెబుతున్నాయి. మల్లన్న ఆలయంలో వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం మల్లికార్జునస్వామికి, సతీమణులైన బలిజ డలమ్మదేవి, గొల్లకేతమ్మ దేవిలు నిత్యం పూజలందుకుంటున్నారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి శివలింగం రూపంలో పూజ లుం డగా ఇక్కడ మాత్రం శ్రీమల్లికార్జునస్వామి రూపంలో పూజలు అందుకుంటారు.

బలిపీఠాలు సిద్ధం
మల్లన్న గుట్ట శిఖరంలో రేణుకాఎల్లమ్మ ఆలయంలో జంతుబలుల నిర్వహణకుగాను బలి పీఠాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బలి పీఠం ఏర్పాటు చేస్తే ఆలయానికి ఆదాయం సమకూరుతుందనే కారణంతో ఈ అపచారాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించడం విశేషం. కొమురవెల్లిలో కొన్ని శతాబ్దాలుగా మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తులు నియమ నిష్టలతో మల్లన్నకు బోనాలు చెల్లిస్తారు. అనంతరం గుట్టపై ఉన్న శ్రీరేణుక ఎల్లమ్మకు బోనాలు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. మొక్కులు అప్పగించి మరుసటి రోజు కొమురవెల్లి సమీపంలోని జగదేవ్‌పూర్‌ మండలం తిగుల్‌నర్సాపూరులోని కొండ పోచమ్మ (మల్లన్న చెల్లెలు)గా భావించే నల్లపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ.

అక్కడ కొండ పోచమ్మ వద్ద అమ్మవారికి మాంసాహారంతో వంటలు వండి మధ్యసాకలు పెడతారు. భక్తులను కొండ పోచమ్మ వద్దకు వెళ్లకుండా ఇక్కడే ఆపగలిగితే కొండ పోచమ్మకు వచ్చే ఆదాయం ఇక్కడకు వస్తుందనే ఆలోచనతో బలిపీఠాల ఏర్పాటుకు పూనుకున్నారు. మే 4న బలిపీఠాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. బలిపీఠంపై బలిచ్చిన మేకలు,కోళ్లను వండుకునేందుకు మల్లన్న గుట్టపైనే రేకులషెడ్‌ నిర్మిస్తున్నారు. శాఖాహారంతో మల్లన్నకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ క్షేత్రంలో మేకలు, కోళ్లను బలి చ్చేం దుకు ఏర్పాటు చేయటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా భావించే మల్లన్న గుట్టపై జంతుబలులను నిషేధించి మల్లన్న క్షేత్ర పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. కాగా ఈ నెల 25నుంచి మల్లన్న బ్ర హ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, ఏర్పా ట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

ఇదేం విడ్డూరం..
మల్లన్నగుట్ట మీద బలిపీఠం నిర్మాణాన్ని ఆలయ అర్చకులందరం వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. ఇక్కడికి మల్లన్న భక్తులు నియమ నిష్టలతో వస్తుంటారు. ఆలయం పవిత్రతపై మాంసం, మద్యం ప్రభావం చూపిస్తుంది. మల్ల న్న తలాపుపైన బలిపీఠం ఉంటే అరిష్టం. సకల జీవులకు అనర్ధం అని గ్రహించాలి. గుట్టపై బలిపీఠాన్ని ప్రోత్సహించకపోవడం ఉత్తమం.  
 – ఆలయ ప్రధాన అర్చకులు

మరిన్ని వార్తలు