రాష్ట్ర ప్రభుత్వానివి ఏకపక్ష విధానాలు

20 Aug, 2019 10:51 IST|Sakshi
ప్రాణహిత నదిలో నాటు పడవపై ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 

కమీషన్లు దక్కవనే  ‘ప్రాణహిత’ తరలింపు

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.45వేల కోట్లు అదనంగా ఖర్చు చేశారు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సాక్షి, కౌటాల/కాగజ్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష విధానాలు అవలంభిస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. కౌటాల మండలంలోని తమ్మిడిహెట్టి వద్ద సోమవారం ఆయన ప్రాణహిత నదిని సందర్శించారు. పడవ ద్వారా నదిలో తిరిగి పూజలు చేశారు. నది వద్ద, కాగజ్‌నగర్‌లోని ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు.  దాదాపు 50 శాతం కాలువల తవ్వకాలు పూర్తి కాగా కమీషన్లకు కక్కుర్తి పడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టును కాళేశ్వరం వద్దకు తరలించిందని ఆరోపించారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును కాకుండా, రూ.83వేల కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మించారని తెలిపారు. రూ.45వేల కోట్లు అధికంగా ఖర్చు చేసిందని వెల్లడించారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని, నిర్మించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు.

సీబీఐ విచారణ చేపట్టాలి..
తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు వేళ్లే నీటిని ప్రస్తుతం కాళేశ్వరంలో ఎత్తిపోతలు చేపట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వార్ధా నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.  కమీషన్లు రావనే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగడం లేదని విమర్శించారు. ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ వెబ్‌సైట్‌లో పెట్టలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు న్యాయం జరిగేలా తమ్మిడిహెట్టి నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, జల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, కాంగ్రెస్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజేంద్రకుమారి, నియోజకవర్గ ఇన్‌చార్జి హరీష్‌బాబు, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు