ఆషాఢమాసం ఎఫెక్ట్‌

8 Jul, 2019 14:26 IST|Sakshi

నవ దాంపత్యంలో కాసేపు విరామం

బంధం బలోపేతానికి మూలం 

నూతన దంపతులకు విరహమాసం

సాక్షి, ఖమ్మం : ఉరిమే మేఘాలు ఒళ్లు జలదరింపజేస్తాయి. మెరిసే మెరుపులు భయకంపితులను చేస్తాయి. ఉరుమూ, మెరుపుల కలయికలో కురిసే చినుకులు మాత్రం మేనుకు కొత్త హాయినిస్తాయి. తోడుగా నిలవాల్సిన సహచరి సాన్నిహిత్యం ఉంటే ఆ హాయి ఆనందాన్నిస్తుంది. కొత్త దంపతులకు ఈ రకమైన పరిసరాలు ఉత్తేజాన్నిస్తాయి. కానీ ఏం లాభం.. చూసుకోవడానికి కూడా వీలు లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే విపరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. నిజంకాకపోయి ఉంటే బాగుండేదన్న తలంపులు. పదే పదే గుర్తొచ్చే భాగస్వామి(ని). అయినా కుదరదంటే కుదరదంతే..అనే పెద్ద వాళ్ల ఆంక్షలు.. కాంక్షలున్న చోట ఆంక్షలు ఎలా నిలుస్తాయనే కుర్రకారు ఆలోచనలు. వెరసి ఆషాఢమాసం నవ దంపతులకు ఎడబాటు తప్పదు. ఈ నేపథ్యంలో నూతనజంటను ఆషాఢంలో విడిగా ఎందుకుంచాలంటే..

బంధం బలోపేతం..
ఆషాఢ మాసంలోని నెల రోజుల పాటు పెళ్లయిన కొత్త జంట మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అయితే ఆ దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి,  ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో దంపతుల వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు అంతగా ప్రాధాన్యత లేకుండేది. ఈ ఆషాఢ మాసం ఎడబాటు కారణంగా వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలు మరింత బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రత్యామ్నాయాలు బోలెడు..
ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రస్తుత ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఎడబాటు భావనను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్‌ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్‌ఎంఎస్‌లు, వాట్సప్‌లు, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాలు ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. తమ విరహాగ్ని చల్లార్చు కునే పలు రకాల ప్రత్యామ్నాయాలకు కొదవేం లేదు. అభిప్రాయాలు, స్వీట్‌ నథింగ్స్‌ షేర్‌ చేసుకుంటూ కాలాన్ని సులువుగా గడిపేయొచ్చు. 

శాస్త్రీయ కోణంలోనూ... మంచిదే
నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం ఏనాటి నుంచో వస్తోంది. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన యువకులు ఆరు నెలల పాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో ఆరునెలల పాటు అత్తవారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు స్తంభించిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండడం అంత మంచిది కాదని ఎందుకంటారంటే.. ఈ సమయంలో ఒక వేళ గర్భధారణ జరగడం తల్లి, బిడ్డలకు అంత క్షేమకరం కాదు. ఆషాఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా సమీప జలాశయాలతోపాటు పరిసరాల్లోని నీళ్లుకలుషితం అవుతాయి. కలుషిత నీటిని వినియోగించినా అనారోగ్యాలు ప్రబలే అవకాశాలున్నాయి. చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు విస్తరించే ప్రమాదం ఉంటుంది.

చీడ, పీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవచనం. ఇపుడు గర్భధారణ జరిగితే ప్రసవ సమయం వచ్చే ఎండాకాలంలో ఉంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే వేసవి సమయం జన్మించే శిశువు బాహ్య పరిసరాలు, ఉష్ణోగ్రతను భరించే స్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఒక్క ఆషాఢ మాసంలో దంపతులు వియోగం పాటిస్తే  సంతానోత్పత్తి సమయాన్ని జూన్, జూలై వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల కారణంగా సుఖ ప్రసవానికి అనుకూలంగా ఉంటుంది. శిశువు సైతం తన నూతన పరిసరాలకు సులువుగా అలవాటు పడతాడు. ఈ శాస్త్రీయ నేపథ్యంలో కొత్త జంటకు ఎడబాటును అనివార్యమని పెద్దలు నిర్ణయించారు.

ఎడబాటు ఎందుకంటే..?
కొత్త కోడలు తన అత్తను చూడకూడదు. అల్లుడు అత్త వారింటి గడప దాటకూడదు అనే నిబంధనలు మానవ సమాజంలో తరచూ వినపించేవే. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీలేవు. అయితే దీని వెనుక శాస్త్రీయత, సంప్రదాయం దాగి ఉంది. ప్రధానంగా మన దేశం వ్యవసాయంపైన ఆధారపడి ఉందని అందరికీ తెలిసిందే.. మృగశిరకార్తె నుంచి ప్రారంభమైన తొలకరి చినుకుల రాక.. క్రమంగా ఆషాఢ మాసంలో అడుగు పెట్టే సరికి పూర్తి వర్షాకాలంగా మారిపోతుంది. సాగు ప్రధానవృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. చినుకుల రాక కోసం ఎదురుచూస్తూ నల్లటి మేఘాలపై కొండంత ఆశతో దుక్కులు దున్నడం, నాట్లు వేయడం వంటి పనులు అనివార్యంగా జరపాల్సి ఉంటుంది.

బడికి వెళ్లే పిల్లల్ని వదిలేస్తే పెద్దవాళ్లంతా వ్యవసాయ పనుల్లోనే బిజీగా ఉంటారు కాబట్టి కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. కాబట్టి కర్మభూమిగా కీర్తిగాంచిన దేశంలో చేసే వృత్తిని కాదని మిగిలినవేవీ చేయాలనుకోరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం వి«ధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ ఈ నియమాన్ని అనుసరిస్తున్నారు.

ఆషాఢం ‘పట్టి’
ఆషాఢమాసంలో పుట్టింటికి పంపించే కోడలికి గతంలో అత్తవారింటి నుంచి ఆషాఢపట్టి అని ఒక పెట్టెను ఇచ్చి పంపించేవారు. దీనిలో ఉత్తరాలకట్ట, పెన్ను, పచ్చీసులాంటి ఆటవస్తువులుండేవి. నెలరోజుల ఎడబాటు కాలంలో భర్తకు ఉత్తరాలు రాసేందుకు, భర్త జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండేందుకు, కాలక్షేపానికి పచ్చీసు ఉపయోగపడేది. ఈ సౌకర్యాలు కూడా లేని రోజుల్లో మేఘ సందేశాలు, పావురాల సందేశాలు ఉండేవంటారు. ఆషాఢ మాసంలో ఎదురయ్యే ప్రేయసీప్రియుల విరహవేదన ప్రధాన కథావస్తువుగా మహాకవి కాళిదాసు మేఘసందేశం రచించారు. ఇప్పుడు సెల్‌ఫోన్లు వచ్చాక.. వాట్సప్‌.. వీడియోకాల్స్‌లో మాట్లాడుకుంటున్నారు.

కొత్త కోడళ్లకు ప్రత్యేకం
నాకు ఇటీవలే వివాహమైంది. ఆషాఢమాసంలో పెట్టుపోత విషయంలో అత్తారింటివారు, అమ్మనాన్నలు కొత్తగా కొత్త బట్టలు ఇవ్వడం ఆచారం. అందుకోసం ఇటీవల షాపింగ్‌ చేశాం. చాలా రకాల కొత్త చీరలు, డ్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్లు ఆకర్షించాయి. చాలా తక్కువ ధరకే అనుకున్న బట్టలు వచ్చాయి. 
– నవ్యశ్రీ, నూతన వధువు, ఖమ్మం 

మరిన్ని వార్తలు