‘సాఫ్ట్‌’గా డ్రైవింగ్‌

10 Jan, 2018 03:19 IST|Sakshi

28% రాత్రి క్యాబ్‌ సర్వీసుల్లో టెక్కీలు.. 

18% ఇతర ప్రైవేట్‌ ఉద్యోగస్తులు

నెలకు రూ.25 – 30 వేల ఆదాయం.. కారు ఈఎంఐ, నెలవారీ ఖర్చులకు సరిపోతున్న ఆదాయం  

సాక్షి, హైదరాబాద్‌ : వరంగల్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ నగరం లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం 8గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు సంస్థలో బిజీగా ఉంటాడు. నెలకు రూ.45 వేల సంపాదన. ప్రతివారం సినిమా, నెలకు రెండుసార్లు ఔటింగ్‌.. ఇలా ఎంజాయ్‌చేసే కిరణ్‌ జీతం తన ఖర్చులకు సరి పోతుంది. దీంతో డబ్బు పొదుపు చేసేందుకు ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెష నల్‌గా పనిచేస్తూనే రాత్రి 8గంటల నుంచి 1గంట వరకు క్యాబ్‌ డ్రైవింగ్‌ చేయాలని నిర్ణయించు కున్నాడు. తనకున్న రూ.9 లక్షల విలువైన కారును ఓ ప్రముఖ క్యాబ్‌ కంపెనీలో లాగిన్‌ చేశాడు.

రోజుకు 5గంటల నుంచి 6గంటల పాటు డ్రైవింగ్‌ ఎంజాయ్‌ చేస్తూ నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కిరణ్‌ సంపాదిస్తున్నాడు. ఇలా కిరణ్‌ ఒక్కడే కాదు.. పగలు కీబోర్డ్‌ను టకటకలాడించినా రాత్రిళ్లు స్టీరింగ్‌ తిప్పే టెక్కీలు చాలామందే ఉన్నారు. ఒక ప్రముఖ క్యాబ్‌ సంస్థ అంచనా ప్రకారం రాత్రి వేళల్లో క్యాబ్‌ డ్రైవ్‌ చేస్తున్న వాళ్లలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడం కోసం కొందరు, డ్రైవింగ్‌ను కూడా హాబీగా భావిస్తూ మరికొందరు రాత్రివేళ స్టీరింగ్‌ పడుతున్నారు.

28 శాతం మంది టెక్కీలు...
హైదరాబాద్‌లో రెండు ప్రముఖ సంస్థలకు చెందిన క్యాబ్‌లు లక్షపైనే తిరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు అధిక సంఖ్యలో క్యాబ్‌లు నడుస్తున్నాయి. రాత్రి 7 నుంచి ఉదయం 4గంటల సమయంలో మాత్రం తక్కువ సంఖ్యలో సర్వీసులు ఉంటున్నాయి. ఈ రాత్రి సమయాల్లో నడిచే క్యాబుల్లో 28శాతం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల క్యాబ్‌లే ఉంటాయని ఒక అంచనా. వీరితో పాటు మరో 18శాతం ఇతర ప్రైవేట్‌ రంగాల్లోని ఉద్యోగస్తులవి. మొత్తం 46శాతం మంది ప్రైవేట్‌ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం క్యాబ్‌ సర్వీసులోకి రావడం ఆసక్తి కల్గిస్తోంది. 

లగ్జరీ కార్లకు డిమాండ్‌
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు ప్రముఖ క్యాబ్‌సర్వీసుల్లో లగ్జరీ కార్లకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌ ప్రాంతాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. ఈ లగ్జరీ సర్వీసుల్లో ప్రీమియం, ఎస్‌యూవీ విభాగాలు అందుబాటులో ఉంటాయి. సాధారణ కార్లకు లగ్జరీ కార్లకు రేట్ల విషయంలో 50శాతం వ్యత్యాసం ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు లగ్జరీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ఆ కార్ల మెయింటెనెన్స్‌ కోసం ప్రీమియం, ఎస్‌యూవీ డిమాండ్లపై నడిపిస్తున్నారు. దీని ద్వారా తక్కువ ట్రిప్పులు చేసినా ఎక్కువ లాభం ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. వీకెండ్స్‌లో ఏకంగా రోజుమొత్తం సర్వీసులిస్తున్నారు. 

రెండు విధాలుగా...
ప్రస్తుతం 28శాతం మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లలో 20శాతం మంది కార్ల యజమానులే డ్రైవర్లుగా వ్యవహరిస్తూ బిజినెస్‌ చేస్తున్నారు. మిగిలిన 8శాతం మంది నమ్మకస్తులను డ్రైవర్లుగా పెట్టి లగ్జరీ కార్లను క్యాబు సర్వీసుల్లోకి దించారు. 

ఉద్యోగ సొమ్ము సేవింగ్స్‌లోకి...
జీతాన్ని పొదుపు ఖాతాలో జమచేసుకుంటున్న ప్రైవేట్‌ ఉద్యోగులు, నెలవారీ ఖర్చులు, ఇంటి కిరాయిలను క్యాబ్‌ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయంతో తీర్చుకుంటున్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుందని చెప్తున్నారు.

నాకు డ్రైవింగ్‌ హాబీ
నాకు డ్రైవింగ్‌ ఇష్టం. మాదాపూర్‌లో పనిచేస్తాను. ఆఫీస్‌ అయిపోగానే ఫ్రెషప్‌ అయి క్యాబ్‌ యాప్‌లో లాగిన్‌ అవుతున్నాను. రాత్రి ఏడునుంచి రెండు గంటల వరకు ఐదారు ట్రిప్పులు ప్రీమియమ్‌ లేదా ఎస్‌యూవీలో నడుపుతున్నా. నెలకు రూ.20 నుంచి 24వేల వరకు వస్తోంది. డ్రైవింగ్‌ హాబీతో అదనపు ఆదాయం బావుంది. – చైతన్యసింగ్‌

ప్రొఫెషన్‌గా ఫీలవుతున్నా
నేను మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. కష్టపడి చదువుకొని మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 6గంటల పాటు క్యాబ్‌ సర్వీసులో ఉంటున్నా. నెలకు రూ.20వేల వరకు వస్తోంది. దీనితో కుటుంబానికి, కారుకు సంబంధించి ఈఎంఐలు కట్టేస్తున్నాను. డ్రైవింగ్‌ అనుకున్నంత సులభంకాదు, ఇది కూడా ప్రొఫెషనల్‌ ఉద్యోగమే. – రాకేశ్‌కుమార్, కరీంనగర్‌

మరిన్ని వార్తలు