మోదీపై నిజామాబాద్‌ రైతుల పోటీ 

24 Apr, 2019 03:41 IST|Sakshi

రంగం సిద్ధం చేసుకున్నపసుపు రైతులు

‘చలో వారణాసి’ కార్యక్రమానికి శ్రీకారం

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీ చేసి సంచలనం సృష్టించిన నిజామాబాద్‌ రైతులు ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే పోటీ చేయాలని నిర్ణయించారు. వారణాసి నుంచి పోటీ చేసి తమ సమస్యను దేశవ్యాప్తంగా మరింత చర్చ జరిగేలా చేయాలని భావిస్తున్నారు. నిజామాబాద్‌ నుంచి నామినేషన్లు వేయడాన్ని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాయని, కేవ లం టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవితను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేయడం వల్ల అసలు విషయం పక్క దారి పట్టిందన్న భావన ఆ రైతుల్లో నెలకొంది. తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి 50 మంది పసుపు రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అక్కడికి బయలుదేరినట్లు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తెలిపారు.

అక్కడ మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయనున్నట్లు తెలిపారు. తమకు మద్దతుగా తమిళనాడు పసుపు రైతుల సంఘం అధ్యక్షు డు దైవశిగామణి నాయకత్వంలో మరికొందరు పసు పు రైతులు నామినేషన్లు వేయడానికి వస్తున్నట్లు తెలిపారు. తమ ప్రధాన ఉద్దేశం పసుపు బోర్డు, మద్దతు ధర సాధన మాత్రమేనన్నారు. గత ఐదేళ్లలో ఎంపీగా కవిత పసుపు బోర్డు సాధించడం కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఈ నెల 29 వరకు వారణాసిలో నామినేషన్లకు గడువు ఉన్నందున ఇతర రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు