‘కోవిడ్‌’.. చికెన్‌తో నో డేంజర్‌!

15 Feb, 2020 03:16 IST|Sakshi

‘కోవిడ్‌’తో సంబంధం లేదంటున్న వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 వైరస్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. గత పక్షం రోజులుగా ఈ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీ నష్టాన్ని చవిచూసింది. కోవిడ్‌–19 వైరస్‌ చికెన్, గుడ్ల ద్వారా వ్యాప్తి చెందుతుందన్న అబద్ధపు ప్రచారం నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల వినియోగం 40 శాతం మేర పడిపోయినట్లు పౌల్ట్రీ ఫెడరేషన్‌ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చికెన్‌కిలో లైవ్‌ బర్డ్‌ రూ.40కే విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. పక్షం రోజులు ముందు ఈ ధర రూ.60 – 80 ఉందన్నారు. నెలకు తెలంగాణలో 4.5 కోట్ల కిలోలు, ఏపీలో 4 కోట్ల కిలోల చికెన్‌ వినియోగం ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అమ్మకాలు 40 శాతం మేర తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. అలాగే నిత్యం తెలంగాణలో 3.5 కోట్లు, ఏపీలో 3 కోట్ల గుడ్ల వినియోగం ఉండగా.. వీటి అమ్మకాలు సైతం 40 శాతం మేర పడిపోయినట్లు అంచనా. చికెన్, గుడ్ల వినియోగం అనూహ్యంగా తగ్గడం, ధరలు అమాంతం పడిపోవడంతో రూ.500 కోట్ల మేర నష్టం చవిచూడాల్సి వచ్చిందని పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ రంగంపై ఇరు రాష్ట్రాల్లో సుమారు 50 వేల మంది ప్రత్యక్షంగా, మరో లక్ష మంది పరోక్షంగా ఆధారపడుతున్నారు. ఇక్కడ రైతులు పండిస్తున్న సోయా, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పౌల్ట్రీ రంగం దోహదపడుతోంది. ఈ రెండు పంటలను 70 శాతం పౌల్ట్రీ రంగం వినియోగిస్తోంది.

కోవిడ్‌–19కు చికెన్‌కు సంబంధం లేదు...
కోవిడ్‌–19 వైరస్‌కు, చికెన్, గుడ్లతో ఎలాంటి సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చైనాలో విభిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, సగం ఉడికిన (హాఫ్‌ బాయిల్డ్‌) ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం తదితర కారణాలతో కోవిడ్‌ వైరస్‌ ఆ దేశంలో విజృంభిస్తోందన్నారు. మన దేశంలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకుపైగా చేరుకోవడం, ఆహార పదార్థాలను సుమారు 100 సెంటిగ్రేడ్‌ వరకు ఉడికించి తింటుండటంతో ఎలాంటి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. కొందరు అదే పనిగా సోషల్‌ మీడియాలో చికెన్, గుడ్లతో ఈ వైరస్‌ సోకుతోందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారమేనని.. చికెన్, గుడ్ల వినియోగంతో వైరస్‌ వ్యాప్తి చెందదని సర్క్యులర్‌ని జారీ చేశాయని పౌల్ట్రీ ఫెడరేషన్‌ ప్రతినిధులు తెలిపారు. 

చికెన్, గుడ్లతో ఆరోగ్యం
సంపూర్ణ పోషకాహారమైన చికెన్, గుడ్ల వినియోగంతో మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. చికెన్‌లో 21.39 శాతం, గుడ్లలో 12.49 శాతం మేర హైక్వాలిటీ ప్రొటీన్లు ఉంటాయి. ఇందులో ఉండే మినరల్స్‌ కూడా మానవ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అందరూ నిర్భయంగా చికెన్, గుడ్లను వినియోగించవచ్చు.  – డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, పౌల్ట్రీ బ్రీడర్స్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు

చికెన్‌.. చక్కటి ఆహారం
చికెన్, గుడ్లు సంపూర్ణ పోషకాహారం. వీటితో ఎలాంటి వైరస్‌ వ్యాప్తిచెందదు. అందరూ అపోహలను, అబద్ధపు ప్రచారాలను వీడి చికెన్, గుడ్లను నిరభ్యంతరంగా తినొచ్చు. మానవ ఆరోగ్యానికి, ఎదుగుదలకు, పోషణకు ఇది చక్కటి ఆహారం. – రమేష్‌ ధాంపురి, పిల్లల వైద్యుడు 

చికెన్, గుడ్లలో పోషక విలువలు ఇలా 
(వంద గ్రాముల చికెన్, గుడ్లలో)
       
            గుడ్లు           చికెన్‌ 
      శక్తి           149          167–239 (కిలో క్యాలరీలు)
    కొవ్వు         400        70 (మిల్లీ గ్రాములు)
 మొత్తం కొవ్వు 10.02    3.08 (గ్రాములు)
సంతృప్త కొవ్వు   3.1      0.79 (గ్రాములు)
 ప్రొటీన్లు          12.49    21.39 (గ్రాములు)

మరిన్ని వార్తలు