ఉత్త చేతులు డొక్కు బండ్లు

17 Dec, 2015 03:25 IST|Sakshi
ఉత్త చేతులు డొక్కు బండ్లు

 ►  ఆయుధాలు లేవు...
 ►  దూసుకుపోయే వాహనమూ లేదు
 ►   మెదక్‌లో దోపిడీ ముఠాదే పైచేయి
 ►   చేజింగ్‌లో వెనుకబడ్డ బలగాలు
 ►  పోలీసుల బలహీనతను  బయటపెట్టిన  
 ►   మెదక్ ఘటన

 
 కాలం మారినా పోలీసుల తీరు మారలేదు. దుండగులు అధునాతన ఆయుధాలు, ఎత్తుగడలతో చెలరేగిపోతోంటే.. కాలం చెల్లిన ఆయుధాలు, సరైన వాహనాలు లేక పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. మెదక్ పట్టణంలో ఏటీఎంపై దాడి ఘటనలో పోలీసులు సకాలంలో స్పందించారు. వారిని దాదాపు 25 కిలోమీటర్లు చేజ్ చేశారు. కానీ వీరి వద్ద సరైన వాహనం లేకపోవడంతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
                                                                                                    - మెదక్
 దోపిడీ దొంగతనాలు.. చోరీలు.. తర చూ జరుగుతున్నాయి. దుండగులు ఎప్పటికప్పుడు తమ స్టైల్ మార్చి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు పూర్తిస్థాయిలో సాయుధులు కాకపోవడంతో దుండగులే పైచేయి సాధిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున మెదక్ పట్టణంలోని ప్రధాన రహదారిలో గల ఎస్‌బీఐ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. లోనికి చొరబడి ఏటీఎంను పెకిలిస్తున్న విషయాన్ని గస్తీ పోలీసులు గుర్తించారు.
 
 పోలీసుల రాకను పసిగట్టిన దుం డగులు బొలేరో వాహనంలో పరారయ్యారు. పురాతన వాహనంలో ఉన్న పోలీసులు వారిని దాదాపు 25 కిలోమీటర్ల మేర వెంబడించారు. సరిహద్దులోని నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించినా అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. అక్కడి పోలీసులకు కూడా వారు చిక్కలేదు. దుండగులు అధునాతన వాహనాన్ని ఉపయోగించడంతో పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు.
 
 సిబ్బంది కొరత...
 మెదక్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 14 పోలీ స్ స్టేషన్లు ఉండగాఅందులో 100 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఒక్క మెదక్ పట్టణంలోనే 15 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టణంలో రోజూ రాత్రి పోలీస్ సిబ్బంది ఏడు బృందాలుగా విడిపోయి గస్తీకాస్తుంటారు. ఇందులో సుమారు 18 మంది వరకు గస్తీకే పోతున్నారు. మెదక్ పట్టణానికి నెలకు 25రోజులపాటు వీఐపీలు వచ్చి వెళ్తుంటారు. వీరి భద్రతకోసం కనీసం 8 నుంచి 10మంది అవసరం.పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐలో భక్తుల రద్దీగా బాగానే ఉంటుంది. రాష్ట్రంలోనే పేరుగాంచిన ఏడుపాయలకు పోలీసులు బందో బస్తుకోసం వెళ్తుంటారు. ఇప్పటికే 43మంది సిబ్బందిగాను 15మంది తక్కువగా ఉన్నారు.
 
 
 దొంగలకు అలుసు..
 పోలీసు సిబ్బంది కొరతను అదనుగా చేసుకున్న దొంగలు గత ఏడాది కొల్చారం మండ లం రంగంపేట బ్యాంకు దోపిడీకి యత్నిం చా రు. పెద్దశంకరంపేట పట్టణంలోని ఎస్‌బీహెచ్ ఏటీఎం, టేక్మాల్‌లోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎం, అల్లాదుర్గంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ కి యత్నించారు. మెదక్ పట్టణంలోని ఆటోనగర్ ఎస్‌బీఐ ఏటీఎంలో రెండోసారి చోరీకి య త్నం జరిగింది. ఇవేకాకుండా బ్యాంకుల్లో సై తం పలుమార్లు దోపిడీకి యత్నించారు. ఇంత జరుగుతున్నా.. సిబ్బంది కొరతను అధిగమిం చకపోవడం ఆ శాఖను తీవ్రం గా వేధిస్తోంది.
 
 బ్యాంకర్ల నిర్లక్ష్యం..
 నిత్యం లక్షలాది రూపాయల్లో లావాదేవీలు నిర్వహించే బ్యాంకర్లు కనీసం రాత్రి వేళలో ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయడం లేదు. తమ ఏటీఎం కేంద్రాలను ఓ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించామని, ఏం జరిగినా బీమా ఉంటుందని బ్యాంకు నిర్వాహకులు చెప్పడం గమనార్హం. దోపిడీ, దొంగతనాలను అరికట్టాలంటే పోలీస్ శాఖలో సరిపడా సిబ్బందిని నియమించడంతోపాటు గస్తీకాసే పోలీసులకు ఆయుధాలతోపాటు అధునాతన వాహనాలు ఇవ్వాలని ప్రజలు సూచిస్తున్నారు.
 
  బుధవారం తెల్లవారుజామున మెదక్ పట్టణంలో జరిగిన ఏటీఎం చోరీ యత్నంలో పోలీసుల వైఫల్యం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి గస్తీ తిరిగే పోలీస్ సిబ్బందికి కండిషన్‌లో ఉన్న వాహనాలతోపాటు ఆయుధాలు సమకూర్చాలని, సిబ్బంది కొరతను అధిగమించి దోపిడీ, దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు