అడ్డొస్తున్నాడనే అంతం 

17 Mar, 2019 12:52 IST|Sakshi
నిందితులను చూపెడుతున్న డీఎస్పీ భాస్కర్‌ తదితరులు

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య 

బూరెడ్డిపల్లి శివారులో హత్య 

సాక్షి, జడ్చర్ల:  తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన భార్య.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి మహబూబ్‌నగర్‌ డీఎస్పీ భాస్కర్‌గౌడ్‌ శనివారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని టీడీ గుట్టలో నివాసం ఉంటున్న రావుల నర్సింహ(35), లక్ష్మిదేవి భార్యాభర్తలు. నర్సింహ మహబూబ్‌నగర్‌  మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు.

వీరికి ఇద్దరు పిల్లలు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి అదే ప్రాంతంలో ఓ కిరాణ దుకాణంలో కూలీగా పనిచేస్తున్న పూసల శేఖర్‌ ప్రవేశించాడు. నర్సింహతో పరిచయం పెంచుకుని అతని భార్య లక్ష్మిదేవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లికాని శేఖర్‌ లక్ష్మిదేవితో సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్న భర్త నర్సింహ శేఖర్‌ను పలుసార్లు మందలించాడు. దీంతో నర్సింహపై శేఖర్‌ కసిని పెంచుకుని చాటుమాటుగా లక్ష్మిదేవితో సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.  

ఏడాదిపాటు ప్రియుడితో సహజీవనం  
ఈక్రమంలో ప్రియుడు శేఖర్‌తో కలిసి లక్ష్మిదేవి ఇంటి నుంచి నల్గొండ జిల్లా దేవరకొండకు వెళ్లి అక్కడే జీవనం కొనసాగించారు. దీంతో భర్త నర్సింహ జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్‌ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. దాదాపు ఏడాది గడిచిన అనంతరం తిరిగి నర్సింహ దగ్గరకు లక్ష్మిదేవి రాగా చేరదీశాడు. అయినా లక్ష్మిదేవి, శేఖర్‌లు తమ ప్రవర్తనను మార్చుకోకుండా సంబంధాన్ని కొనసాగిస్తుండగా నర్సింహ మందలించి బుద్ది చెప్పాడు.

దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన వారు నర్సింహ అడ్డు తొలగించుకోవాలని, అడ్డు తొలగితే అతని ఉద్యోగంతో పాటు అతనికి సంబంధించిన ఓ ప్లాటు సైతం తమ చేతికి వస్తాయని భావించి హత్య చేసేందుకు వ్యూహరచన చేసి రెక్కీ కూడా నిర్వహించారు. అందులో భాగంగా ప్రియుడు శేఖర్‌ లక్ష్మిదేవి భర్త నర్సింహతో మంచిగా మసులుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి మద్యం సేవించి విందులు చేసుకోవడం ప్రారంభించారు.

మొదట గుర్తు తెలియని మృతదేహంగా..
ఈనెల 7న బూరెడ్డిపల్లి గ్రామ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మొదట గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేయగా.. హత్య కేసుగా గుర్తించారు. వెంటనే మృతుడి ఆచూకీని తెలుసుకుని శేఖర్, లక్ష్మిదేవి నిందితులుగా గుర్తించారు. శనివారం జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో నిందితులు రైలు ఎక్కి పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమాచారం  రావడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ భాస్కర్‌గౌడ్‌ తెలిపారు.

హత్యా ప్రదేశానికి కొద్ది దూరంలో గల ముళ్లపొదల్లో దాచిన నిందితుల రెండు మొబైల్‌ఫోన్లు, రక్తంతో కూడిన ప్లాస్టిక్‌ కవర్, బీరు బాటిల్‌ ముక్కలు స్వాధీన పరుచుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ బాల్‌రాజ్‌యాదవ్, ఎస్‌ఐలు కృష్ణయ్య, షంషొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

పని ఉంది మాట్లాడి వద్దామంటూ..
 ఇదిలా ఉండగా, జడ్చర్ల శివారులో మిషన్‌ భగీరథ పనులు ఉన్నాయని అక్కడ పనిచేసేందుకు మాట్లాడి వద్దామంటూ ఈ నెల 3న శేఖర్‌ నర్సింహను తోలుకొని బూరెడ్డిపల్లి శివారు వచ్చాడు. సంబంధిత సార్లు లేరని వారు వచ్చే వరకు మద్యం సేవిద్దామంటూ ఓ దగ్గర సిట్టింగ్‌ చేశారు. నర్సింహకు మద్యం బాగా తాపించిన తరువాత అతని భార్య లక్ష్మిదేవికి ఫోన్‌ చేసి అక్కడకు రప్పించాడు శేఖర్‌.

మద్యం మత్తులో ఉన్న నర్సింహ తలపై బీరు సీసాతో కొట్టి, గొంతుపై పగిలిన సీసాతో పొడిచారు. కొనప్రాణంతో ఉండగా నర్సింహ కాళ్లను ప్రియుడు శేఖర్‌ గట్టిగా పట్టుకోగా ప్రియురాలు లక్ష్మిదేవి ప్లాస్టిక్‌ కవర్‌ తలచుట్టూ చుట్టి ఊపిరి ఆడకుండా చేయడంతో నర్సింహ చనిపోయాడు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా