బియ్యం సరఫరాపై చర్చ

24 Mar, 2020 02:54 IST|Sakshi

పాత విధానంలోనే పంపిణీకి ప్రణాళిక 

సరఫరా వాహనాలను రెట్టింపు చేసేందుకు నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం లాక్‌డౌన్‌ అయిన నేపథ్యంలో తెల్లకార్డు దారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీన్ని పాత రేషన్‌ విధానం ద్వారానే పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఉన్న చౌక ధరల దుకాణాల నుంచే లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఉచితంగా ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. చౌక ధరల దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిస్తూ ఎలా సరఫరా చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు రూ.1,500 ఆర్థిక సాయం ఎలా అందించాలన్న దానిపై కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. కాగా రాష్ట్రంలోని 87.59 లక్షల రేషన్‌ కార్డు కుటుంబాల్లోని ప్రతి కార్డుదారుకు 12 కిలోల బియ్యం ఉచితంగా సరఫరా చేస్తామని ఆదివారం సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. దానికోసం ఏకంగా 3.58 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించారు.

ఈ బియ్యాన్ని జిల్లా కేంద్రాల నుంచి స్థానిక రేషన్‌ దుకాణాలకు రవాణా చేయించడం, అక్కడి నుంచి లబ్ధిదారులకు పంపిణీ వంటి అంశాలపై సోమవారం సంస్థ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అధికారులతో సమీక్ష జరిపారు. రవాణా వాహనాలను పెంచి బియ్యం రవాణాను త్వరితగతిన చేపట్టాలని నిర్ణయిం చారు.ఆ దిశగా రవాణా వాహనాల కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇక ఈ నిల్వలను స్థానికంగా అందుబాటులో ఉండే పాఠశాల ప్రాంగణాల్లోనూ, లేదా అక్కడ సమకూరిన గిడ్డంగులలోనూ పంపిణీకి అనుకూలంగా నిల్వచేసుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం నుంచే బియ్యం రవాణా మొదలుకానుంది. రేషన్‌ దుకాణాల వద్ద జనం సామాజిక దూరం పాటించేలా ఏ రోజు, ఎంతమందికి, ఏ సమయంలో ఇవ్వాలన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఒక రోజులో సగం మందికి, మిగతా రోజు మిగిలిన వారికివ్వడమా? లేక ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాలుగా విడగొట్టి ఆ సమయంలోనే రేషన్‌ తీసుకునేలా విభజన చేయడమా? అన్నదానిపై చర్చిస్తున్నారు. దీనిపై మంగళవారం స్పష్టత వస్తుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి.  

ఆధార్‌ వివరాల ఆధారంగా..
ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,500 ఆర్థిక సాయం అందించేందుకు కూడా పౌరసరఫరాల కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి చర్యలు ప్రారంభించారు. ఈ అంశంపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఆయన చర్చలు జరిపారు. నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపించేం దుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు ఆధార్‌ వివరాలతో అనుసంధానం చేసుకొని నగదును బదిలీ చేయాలని యోచిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

ధరల నియంత్రణకు కమిటీలు.. 
ఇక నిత్యావసర ధరలను వ్యాపారులు ఇష్టారీతిన పెంచేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని శాఖ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ కమిటీలు ధరల నియంత్రణకు చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు.

మరిన్ని వార్తలు