ఉత్తరమా.. ఏది నీ చిరునామా?

1 Jul, 2020 11:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేడు పోస్టుకార్డు దినోత్సవం

సాక్షి, ఖమ్మం : పోస్ట్‌..అంటూ పోస్ట్‌మన్‌ పిలుపు వినిపిస్తే చాలు..ఎంతో సంతోషంగా ఇంట్లో నుంచి ఎదురేగి ఉత్తరం అందుకునేవారు దశాబ్దాల కిందట. పోస్టుకార్డు, ఇన్‌లాండ్‌ లెటర్లలోని ఆత్మీయ, అనుంబంధాలు, యోగ, క్షేమాల అక్షర రూపాలను తనివితీరా చదివి ఆనందించడం ఆ రోజుల్లోని మధురానుభూతి. ఆధునిక పరిజ్ఞానంతో అందివచ్చిన స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లు, ఈ మెయిళ్ల నేటి కాలంలో ఉత్తర, ప్రత్యుత్తరాలు ఆగిపోయి తోకలేని పిట్ట తుర్రుమంది. కేవలం ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యకలాపాలు, ఉద్యోగ పిలుపులు, ఇతర సమాచారం కోసం ఈ సేవలు కొనసాగుతున్నాయి. మన దేశంలో ఆంగ్లేయుల పాలనలో 1879 జూలై1న పోస్టుకార్డు ఆవిర్భవించిందని చరిత్ర చెబుతోంది. నాడు బంధువులకు, మిత్రులకు ఉత్తరాల ద్వారానే సమాచార మార్పిడి జరిగేది. ఇంకా అభిప్రాయాల సేకరణ, సాహితీ విశ్లేషణ, కలం స్నేహం, ఆకాశవాణి, దూరదర్శన్‌లకు ఉత్తరాలు రాయడం, అక్కడి నుంచి జాబులు అందుకోవడం ఓ అరుదైన జ్ఞాపకమే మరి. జూలై 1న పోస్టు కార్డు దినోత్సవం సందర్భంగా నాటి ఉత్తరంతో అనుబంధాన్ని పలువురు ఇదిగో ఇలా పంచుకున్నారు.  

ఉత్తరం కోసం ఎదురుచూసేవాడిని
నాకు ఉద్యోగం రాక ముందు స్నేహితులకు, బంధువులకు లెటర్లు రాసేది. ఉత్తరం తీసుకుని పోస్టుమన్‌ ఎప్పుడు వస్తాడా..అని ఎదురూచూస్తుండేది. అంతటి ఆదరణ కలిగిన పోస్టు కార్డులు నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.       
– సంకటాల శ్రీనివాసరావు, పెద్దమ్మ తల్లి దేవస్థానం ఈఓ, పాల్వంచ  

పరీక్ష పాసయ్యానని లెటర్‌ వచ్చింది..
1990లో ఏపీ స్టడీ సర్కిల్‌ ద్వారా సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌కు  పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించినట్లు పోస్టుకార్డు ద్వారా సమాచారం వచ్చింది. అది నేటికీ మరిచిపోలేను. మా చుట్టాలు యోగక్షేమాలు రాసి పంపేవారు. 
- డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్,  పాల్వంచ

మూడు రోజుల్లో చేరేది..
దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఉత్తరం రాస్తే..అది మూడు రోజుల్లో వారికి చేరేది. వాళ్లు రాసి పంపినా అన్నే రోజులు పట్టేది. మేం వారి ఉత్తరం కోసం ఎంతో ఆత్రుతగా నిరీక్షించి చూసేవాళ్లం. 
- భాస్కర్‌రావు, రిటైర్డ్‌ వీఆర్వో, పాల్వంచ

పోస్టుకార్డులు అమ్ముడు పోవట్లేదు..
గతంలో మాదిరిగా పోస్టు కార్డులు ఈ రోజుల్లో అమ్మకాలు జరగట్లేదు. పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు మాత్రమే అప్పుడప్పుడు కొనుగోలు చేస్తున్నాయి. నేటితరం వారు తీసుకోవట్లేదు. 
- కిరణ్‌కుమార్, పాల్వంచ ఇన్‌చార్జ్‌ పోస్టుమాస్టర్‌

కలం స్నేహం గుర్తుకొస్తోంది..
ఆ రోజుల్లో ఉత్తరం రాయడం ద్వారానే చాలామంది స్నేహితులు పరిచయమయ్యారు. ఇప్పటికీ కొంతమందితో ఆ స్నేహం కొనసాగుతోంది. నాటి ఉత్తరాలు అనేకం నా వద్ద ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అభిప్రాయాలను పంచుకునేందుకు ఉత్తరాన్ని మించిన వేదిక మరొకటి ఉండదు. 
- బత్తుల వీరయ్య, టీఆర్‌ఎస్‌ నాయకుడు, నాయకులగూడెం 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు