‘జన జాతర’కు అనుమతి నిరాకరణపై పిటిషన్‌ 

10 Mar, 2018 00:44 IST|Sakshi

తదుపరి విచారణ 13కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(టీఎస్‌సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో ఈ నెల 10న ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన జన జాతర సభకు పోలీసులు అనుమతి నిరాకరించటాన్ని సవాల్‌ చేస్తూ సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు.

అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సభ అనుమతి కోసం జనవరి 25నే దరఖాస్తు చేసుకున్నామని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సభకు సాంస్కృతిక శాఖ అనుమతిచ్చినప్పటికీ, పోలీసులు మాత్రం కుదరదని గురువారం తమకు తెలిపారని పేర్కొన్నారు. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో సభల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం లేదని, మరో తేదీలో ప్రత్యామ్నాయ వేదికను ఎంపిక చేసుకుంటే పరిశీలిస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ..నిజాం కాలేజీలో సభను నిర్వహించుకునేందుకు అనుమతికి దరఖాస్తు చేసుకుంటామన్నారు.  

సభ వాయిదా 
జన జాతర సభను ఈ నెలాఖరుకు వాయిదా వేసినట్లు టీఎస్‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రకటించారు. విద్యార్థుల పరీక్షల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు