పెట్రోల్‌పై రూ.2.69, డీజిల్‌పై రూ.2.65

6 Jul, 2019 03:57 IST|Sakshi

రాష్ట్రంలో భారీగా పెరిగిన పెట్రో ధరలు

కేంద్ర బడ్జెట్‌లో సుంకాలు పెంచడంతో ధరల పెరుగుదల

రాష్ట్ర సుంకాలు కలుపుకొని మరింత వడ్డన పెట్రోల్‌ రూ.77.57, డీజిల్‌ ధర రూ.72.71

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌పై అదనపు సుంకాలు విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.74.88 ఉండగా, అది రూ.77.57కు చేరింది. అంటే పెట్రోల్‌పై రూ.2.69 పెరిగింది. డీజిల్‌ ధర బుధవారం లీటర్‌ రూ.70.06 ఉండగా, అది రూ.72.71కి చేరింది. అంటే డీజిల్‌పై రూ.2.65 పెరిగింది.

పెట్రోల్, డీజిల్‌ ఒక్కో లీటర్‌పై 1 శాతం చొప్పున విధించిన స్పెషల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, సెస్‌తో పాటు రాష్ట్రం పరిధిలోని ఇతరత్రా సుంకాలతో కలిపి ఈ మేర పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఈ ప్రభావం తెలంగాణలోని 90 లక్షల వాహనదారులపై పడనుంది. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే 60 లక్షల వాహనాలున్నాయి. ముఖ్యంగా సరుకు రవాణాపై ఈ భారం ఎక్కువ ఉంటుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా నిత్యావసరాలు, కూరగాయాలు, పండ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్‌ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల భారమే ఎక్కువగా ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా పెట్రో ధరలు మాత్రం దిగిరావట్లేదు.

పన్నులతో బాదుడు..
పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నుల విధిస్తుండటంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ విధిస్తున్నాయి. కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.17.98లు, డీజిల్‌పై రూ.13.83 వసూలు చేస్తోంది. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ పన్ను మోత మోగిస్తోంది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్‌ 27 శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. తమిళనాడులో పెట్రోల్‌పై 34 శాతం, డీజిల్‌పై 24 శాతం వ్యాట్‌ ఉండగా, డిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్‌ పన్ను 27 శాతం ఉండగా, గోవాల్లో అతి తక్కువగా 17 శాతం వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్‌పైనే చమురు ఉత్పత్తుల ధరలు ఆధారపడినట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు