కోతకైనా సిద్ధం. ..సర్కారీ ఆస్పత్రి నిషిద్ధం!

20 Oct, 2019 03:10 IST|Sakshi

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేందుకు గర్భిణుల భయాందోళన

వసతుల లేమి, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటున్న వైద్య వర్గాలు

వైద్యులు సిజేరియన్‌ చేయడం లేదని ఆవేదన

ఫలితంగా ప్రైవేటు ఆస్పత్రులవైపు మొగ్గు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చాలామంది గర్భిణులు సిజేరియన్‌కే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కొందరు గర్భిణులు సాధారణ ప్రసవాలకు అంగీకరించడంలేదు. పురుటి నొప్పుల సమయంలో పరిస్థితి చేజారిపోతున్నా సాధారణ ప్రసవమే చేద్దామని ప్రభుత్వ వైద్యు లు చేస్తున్న ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రసవాలు చేసే లేబర్‌ రూంలు సరిగా లేకపోవడం, కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలపై గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆందోళ చెందుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సాధారణ ప్రసవం చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీన్నే ఆసరాగా తీసుకొని ప్రైవేటు ఆసుపత్రులు అవసరమున్నా లేకపోయినా సిజేరియన్‌ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనే కనిపిస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవాలు చేస్తే మంచిదేనని, కానీ గర్భిణీలను మానసికంగా సిద్ధం చేయకుండా ఒత్తిడి చేస్తే ప్రయోజనం ఉండదని వైద్యులు అంటున్నారు. దీంతో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య ఒకట్రెండు శాతం తగ్గిందని వైద్య విధాన పరిషత్‌లోని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ ఏడాది 3.83 లక్షల మంది 
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3.83 లక్షల మంది శిశువులు జన్మించారు. అందులో 2.18 లక్షల (57%) మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 1.65 లక్షల (43%) మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మించారు. గతేడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటి సంఖ్య ఒకట్రెండు శాతం అధికంగా ఉందని, ఇప్పుడు తగ్గిందని అంటున్నారు. ఇక ఇప్పటివరకు జరిగిన ప్రసవాల్లో మొత్తంగా 59% సిజేరియన్‌ ద్వారా ప్రసవాలు చేశారు. అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 45%, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 78% సిజేరియన్‌ ద్వారా జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌ తదితర జిల్లాల్లో గర్భిణులు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవం అంటేనే హడలిపోతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించా యి. సాధారణ ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం రూ. 25 వేలతో ముగించేయవచ్చు. అదే సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసినందుకు, వారం పది రోజులపాటు ఆస్పత్రిలో అద్దె గదుల్లో ఉంచినందుకు ఆస్పత్రి స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు