‘సీతారామ’ పూర్తి చేయిస్తా

26 Sep, 2019 11:23 IST|Sakshi

ఖమ్మంలో మోడల్‌ బస్టాండ్‌ నిర్మిస్తాం  

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

సాక్షి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉభయ జిల్లాల ప్రజల సమస్యలు తనకు కూలంకశంగా తెలుసునని, రెండు జిల్లాల అభివృద్ధికి నిర్మాణాత్మకంగా కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో గోదావరి నీళ్లు తాగి, మైదాన ప్రాంతంలో పెరిగానని అన్నారు. ఉమ్మడి జిల్లాపై పట్టు ఉందని, ప్రజలతో తన కు, తన కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తనకు మంత్రి పదవి ఉన్నప్పటికీ ఎప్పటిలా సామాన్యుడిలాగే ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటా నని తెలిపారు. తన కుటుంబం కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చిందని, తాను కేసీఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నానని.. క్రమశిక్షణతో తన బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు.

జిల్లాకు అతి ముఖ్యమైన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో గ్రానైట్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, తన వద్దకు వచ్చిన ప్రతి సమస్యనూ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని, వడివడిగా జిల్లాల అభివృద్ధి ముందుకు సాగేలా కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గాన్ని అభి వృద్ధి చేసుకునే అవకాశం వచ్చిం దని, నగరం అభివృద్ధికి ఇప్పటికే పలుచోట్ల రోడ్ల విస్తరణ చేసి, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశామని, ప్రజలు సహకరిస్తే మిగిలిన రోడ్ల వైడింగ్‌ చేపడతామని వివరించారు. రోడ్లపై ఏర్పడిన గుం తలను పూడ్చేందుకు ప్రస్తుతానికి ప్యాచ్‌ వర్క్‌లు చేయిస్తున్నామని, వర్షాలు కురుస్తుండడంతో పనులు ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం చివరి వరకు ఖమ్మంలో ఐటీ హబ్‌ను ప్రారంభిస్తామన్నారు. ఖమ్మంలో నిర్మిస్తున్న నూతన బస్‌ స్టేషన్‌ను మోడల్‌ బస్‌ స్టేషన్‌గా చేస్తామని చెప్పారు.  ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో పర్యటించిన తాను త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి సమస్యలపై దృష్టిసారిస్తానని ప్రకటించారు. 

మరిన్ని వార్తలు