రామారెడ్డి రోడ్డుకు మహర్దశ

9 Apr, 2018 12:34 IST|Sakshi
సదాశివనగర్‌ నుంచి రామారెడ్డి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు

ముమ్మరంగా సదాశివనగర్‌ – రామారెడ్డి రోడ్డు నిర్మాణ పనులు

రూ. 13 కోట్లు మంజూరు

డబుల్‌రోడ్డుగా మార్చడంతో ప్రయాణికుల హర్షం

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి):సదాశివనగర్‌ – రామారెడ్డి రోడ్డుకు మహర్దశ వచ్చింది. రూ. 13 కోట్లతో రోడ్డు పనులు చురుకుగా సాగుతున్నాయి. గతంలో ఈ సింగిల్‌ రోడ్డుగా ఉండగా ప్రస్తుతం డబుల్‌ బీటీ రోడ్డు వేస్తుండడంతో వేస్తుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సదాశివనగర్‌ నుంచి మాచారెడ్డి చౌరస్తాకు వెళ్లడానికి గతంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో సదాశివనగర్‌ నుంచి రామారెడ్డి వరకు బీటీ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. దీంతో పనులు చకాచకా కొనసాగుతున్నాయి. గతంలో అధికారుల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉండేది. ఈ రోడ్డు మీదుగా గుండా సదాశివనగర్‌ నుంచి రామారెడ్డి మీదుగా మాచారెడ్డి చౌరస్తా వరకు వెళ్లడానికి దారి సులువుగా ఉంటుంది.

రామారెడ్డి మండలంలో గల ప్రధాన దేవాలయం శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు ఈ రోడ్డు గుండానే వెళ్తుంటారు. రోడ్డు అధ్వానంగా ఉండడం వల్ల గతంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డుకు నిధులు మంజూరు కావడం, పనులు వేగంగా కొనసాగుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే మండలంలోని తిర్మన్‌పల్లి, మర్కల్‌ గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవడంతో పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు మండలంలోని మరిన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి ఎంఆర్‌ఆర్‌ గ్రాంట్‌ కింద నిధులు మంజూరవడంతో రోడ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో మండలంలోని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బీటీ రోడ్లకు మరమ్మతులు
సదాశివనగర్‌ మండలంలో ఎంఆర్‌ఆర్‌ గ్రాంట్‌ కింద జాతీయ రహదారి నుంచి అడ్లూర్‌ ఎల్లారెడ్డి వరకు రూ. 24 లక్షలు, గర్గుల్‌ నుంచి రంగంపేట్‌ వరకు రూ. 64 లక్షల 50 వేలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోకుల్‌తండాకు రూ. 47లక్షలు, రామారెడ్డి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గర్గుల్‌ నుంచి కన్నాపూర్‌కు రూ. 77లక్షలు, కన్నాపూర్‌ రోడ్డు నుంచి రెడ్డిపేట్‌ రోడ్డుకు రూ. 45లక్షలు, జాతీయ రహదారి నుంచి సదాశివనగర్‌ వరకు రూ. 36లక్షలు, జాతీయ రహదారి నుంచి మర్కల్‌–తిర్మన్‌పల్లి గ్రామం వరకు రూ. 22లక్షలు, జాతీయ రహదారి నుంచి కుప్రియాల్‌ వరకు రూ. 36 లక్షలతో మరమ్మతు పనులు చేపడుతున్నారు. అలాగే జాతీయ రహదారి నుంచి మోషంపూర్‌ వయా అడ్లూర్‌ ఎల్లారెడ్డి వరకు రూ. 66లక్షలు, అడ్లూర్‌ఎల్లారెడ్డి నుంచి అడ్లూర్‌కు రూ. 55లక్షలు, జాతీయ రహదారి నుంచి ధర్మారావ్‌పేట్‌ వరకు రూ. 47లక్షలు, జాతీయ రహదారి నుంచి మల్లుపేట్‌ వరకు రూ. 6లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రంగంపేట్‌ వయా పోసానిపేట్‌ వరకు రూ. 40లక్షలు, పద్మాజివాడి రోడ్డు నుంచి భూంపల్లి వయా లింగంపల్లి వరకు రూ. 26లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మోడెగాం వరకు రూ. 16లక్షల 50వేలు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా గ్రామాల్లో రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు