రిజిస్ట్రేషన్ల ఆదాయంపై కరోనా దెబ్బ!

28 Jun, 2020 04:23 IST|Sakshi

ఈ ఏడాది తొలి త్రైమాసికం ఆదాయం రూ.600 కోట్లే

సాధారణ పరిస్థితుల్లో ఒక్క నెలలోనే రూ. 500 కోట్లకు పైగా రాబడి

‘రియల్‌’ లావాదేవీలు మళ్లీ పుంజుకోవడంతో గాడిన పడ్డ వ్యవస్థ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పుణ్యమాని రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక్క నెలలో రావాల్సిన ఆదాయం వచ్చేందుకు మూడు నెలలు పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం మరో రెండు రోజుల్లో ముగియనుండగా ఆ శాఖ ఆదాయం రూ. 600 కోట్ల మార్క్‌ చేరింది. లాక్‌ డౌన్‌ సమయంలో ఏప్రిల్‌ నెల పూర్తిగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో ఆ నెలలో రూ.12 కోట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ లావాదేవీల ద్వారా వచ్చాయి. ఇక, మే నెల ఆరో తేదీ నుంచి మళ్లీ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ప్రారంభం అయినా ఆ నెలలో సెలవు దినాలు పోను కేవలం రూ.200 కోట్లకుపైగా మాత్రమే రాబడి వచ్చింది. జూన్‌ నెలలో కొంత మేర రియల్‌ లావాదేవీలు పుంజుకోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.400 కోట్లకు చేరింది. వెరసి మూడు నెలల్లో రూ.1500–1800 కోట్లు రావాల్సి ఉండగా అతికష్టంగా రూ.600 కోట్లు ఖజానాకు సమకూరాయి. కాగా, జూన్‌ నెల రాబడులు ఆశాజనకంగానే ఉన్నాయని, రాజధాని హైదరాబాద్‌ శివార్లలో క్రమంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదుటున పడుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే జూలై మాసం నుంచి సాధారణ పరిస్థితుల్లో వచ్చే ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మూడో నెలలో ముచ్చటగా...
వాస్తవానికి, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం నెలకు రూ. 500–600 కోట్ల వరకు వస్తుంది. రోజుకు 5 వేల వరకు లావాదేవీలు జరిగి, రూ.20 కోట్ల వరకు రాబడి వచ్చేది. కానీ, కరోనా వైరస్‌ ప్రభావంతో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిచిపోవడం, ప్రజల వద్ద తగినంత నగదు లభ్యత లేకపోవడంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాయిదా పడ్డ రియల్‌ లావాదేవీలు మళ్లీ ప్రారంభం కాలేకపోయాయి. అంతకన్నా ముందు జరిగిన ఒప్పందాలూ ఆగిపోయాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా ఉండే వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు కూడా జరగలేదు. దీంతో దాదాపు మార్చి నెలలో సగ భాగం, ఏప్రిల్, మే నెలలు పూర్తిగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాల్లో స్తబ్దత నెలకొంది.

మళ్లీ ఇప్పుడు గాడిలోకి..
కరోనా లాక్‌డౌన్‌ ఎత్తేసిన రెండో నెలలో భూ లావాదేవీలు మళ్లీ కోలుకున్నాయని జూన్‌ నెల రిజిస్ట్రేషన్‌ ఆదాయ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రియల్‌ లావాదేవీలు ఊహించిన దానికన్నా ఎక్కువ పెరిగాయని, ప్రజల వద్ద నగదు లభ్యత పెరగడంతో పాటు బ్యాంకులు కూడా రుణాలిచ్చే దిశలో ఉదారంగా వ్యవహరిస్తుండటం, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై తెలంగాణలో ఆంక్షలు తొలగించిన కారణంగా గతంలో వేసిన పెద్ద వెంచర్లు, జరిగిన ఒప్పందాల్లో కదలిక వచ్చింది. దీంతో జూన్‌ నెలలో సగటున రోజుకు రూ.14 కోట్ల మేర రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదాయం సమకూరింది. ఇందులో 70 శాతానికిపైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చిందేనని ఆ శాఖ ఉన్నతాధికారులంటున్నారు. అందుకే జూన్‌ నెలలో రాబడి రూ.400 కోట్లకు చేరిందని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై నెలలో ఆదాయం మరింత పెరిగి మునుపటిలా యథాతథ స్థితికి చేరుతుందనే ధీమా రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు