అన్నం పెట్టలేదని.. తల్లిని చంపిన తనయుడు

26 Nov, 2014 03:40 IST|Sakshi
అన్నం పెట్టలేదని.. తల్లిని చంపిన తనయుడు

ఎల్కతుర్తి : అగిడిన వెంటనే అన్నం పెట్టలేదనే కారణంగా ఓ కొడుకు కన్నతల్లిని రోకలిబండతో మోది ప్రాణం తీశాడు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన అల్లి సుగుణమ్మ(50)-సమ్మయ్యలకు నలుగురు కుమారులు. సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం ఎల్కతుర్తిలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇతని పెద్ద కుమారుడు అల్లి భాస్కర్ కొంత మతిస్థిమితం లేని వానిలా ప్రవర్తిస్తుంటాడు. నిత్యం ఉదయం పొలానికి వెళ్లి పనులు ముగించుకుని రాత్రికి ఇంటికి వస్తుండేవాడు.

మంగళవారం ఉదయం పొలానికి వెళ్లేందుకు తల్లి సుగుణమ్మను అన్నం పెట్టమన్నాడు. పనిలో ఉన్న ఆమె కొద్దిగా ఆగాలని కొడుకుకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన భాస్కర్ పక్కనే ఉన్న రోకలిబండ తీసుకుని తల్లిని మోదాడు. ఆమె కిందపడి తీవ్ర రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుండగా ఇరుగుపొరుగు వారు గమనించి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే సుగుణమ్మ మృతిచెందింది. సంఘటన స్థలాన్ని హుజూరాబాద్ రూరల్ సీఐ భీంశర్మ, ఎస్సై ఎం.రవి పరిశీలించారు. భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 తండ్రిపై గొడ్డలితో దాడి
 భాస్కర్ 2010లో తండ్రి సమ్మయ్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఆయన తృటిలో తప్పించుకోగా చెయ్యి వేలు తెగింది. పోలీసులు కేసు నమోదు చేయగా రెండేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. జైల్లో ఉన్న సమయంలో అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో వైద్యం చేయించారు. ప్రవర్తనలో కొంత మార్పు రాగానే బెయిల్‌పై విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు