వైద్య, ఆరోగ్య శాఖకు రూ.7,375 కోట్లు

16 Mar, 2018 03:50 IST|Sakshi

నల్లగొండ, సూర్యాపేటలో వైద్య కాలేజీలు 

కేసీఆర్‌ కిట్‌కు తగ్గిన కేటాయింపులు

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. గత ఏడాది కంటే ఈ సారి బడ్జెట్‌లో రూ.1,339 కోట్లు పెంచి, రూ.7,375.20 కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాల కోసం ప్రగతి పద్దు కింద రూ.3,852.49 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.3,522.71 కోట్లు కేటాయించారు. వైద్య విద్యను మరింత బలోపేతం చేసేందుకు నల్లగొండ, సూర్యాపేటలో ప్రభుత్వ వైద్య కాలేజీలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తాజా బడ్జెట్‌లోనూ ఆ మేరకు కేటాయింపులు జరిపింది. అయితే గత ఏడాదితో పోలిస్తే అమ్మ ఒడి (కేసీఆర్‌ కిట్‌) పథకానికి కేటాయింపులు స్వల్పంగా తగ్గాయి. గత బడ్జెట్‌లో రూ.605 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.560.50 కోట్లు కేటాయించారు.  

ఆరోగ్యశ్రీకి పెంపు... 
ఆరోగ్యశ్రీకి ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి. గత రెండేళ్లుగా బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. తాజా బడ్జెట్‌లో నిధుల పెంపు నేపథ్యంలో బకాయిల చెల్లింపు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి రూ.503.20 కోట్లు ఇవ్వగా, ఈ సారి రూ.699.44 కోట్లు కేటాయించింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య, వైద్య సేవల కోసం రూ.300 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటికే ఈహెచ్‌ఎస్‌/జేహెచ్‌ఎస్‌ వైద్య సేవల బకాయిలు రూ.410 కోట్ల వరకు ఉన్నాయి. ఈ చెల్లింపులను జరపకపోవడంతో ఆస్పత్రులు కొన్నిసార్లు సేవలకు నిరాకరిస్తున్నాయి. 

ఊసులేని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు..
హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్‌లో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించినట్లు గత బడ్జెట్‌లో ప్రస్తావించారు. బ్యాంకు నుంచి రుణాలు పొంది నిధులను సమకూర్చనున్నట్లు చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం కల్పించారు. ప్రస్తుత బడ్జెట్‌లో వీటిని ప్రస్తావించకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు