ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీడియో వైరల్‌

1 Jul, 2019 10:50 IST|Sakshi

సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ : సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులపై ఆదివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిని ఎమ్మెల్యే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దాడికి సంబంధించిన కారణాలను విలేకరులకు ఎలా చెప్పాలో ఆదివాసీలు, గిరిజనులకు ఆయన హితబోధ చేశారు. తప్పంతా అధికారులదే అన్నట్లుగా ఉండాలని ఎమ్మెల్యే కోనప్ప ఆ వీడియోలో చెప్పడం గమనార‍్హం. ఆ వీడియోలో ‘ ఇప్పుడు నేను విలేకరులను పిలిపిస్తున్నా. వాళ్ల ముంగిట చెప్పండి. భూములు దగ్గరకు వెళ్లొద్దని రోజు వచ్చి బెదిరిస్తున్నారు. భూముల్లో తవ్వకాలు జరిపారు. మా భూములు లోపల ఉన్నాయి. అక్కడకు వెళ్లకుండా మమ‍్మల్ని బెదిరిస్తున్నారు. 15 రోజుల క్రితం వచ్చి కొట్టారు. ఇప్పుడు మళ్లీ కొట్టారు. కొట్టాక అందరం దున్నొద్దని ట్రాక్టర్ల దగ్గరకు వెళ్లాం. అప్పుడే గొడవ అయింది. ఇదంతా చెప్పాలి. విలేకరులను పిలిపిస్తా. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.’ అంటూ ఎమ్మెల్యే పేర్కొనడం విశేషం.

చదవండి: మహిళా అటవీ అధికారిపై ప్రజాప్రతినిధి దాడి

కాగా అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూమిని చదును చేసి మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్‌ అధికారుల బృందంపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, కుమురంభీం జిల్లా జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు యథేచ్ఛగా దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళా అటవీ అధికారిణి అనిత చేయి విరగడంతో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. కుము రంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అధికార పార్టీ నాయకుడు, సాక్షాత్తూ జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్, ఎమ్మెల్యే సోదరుడు ఇందుకు బాధ్యుడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే సోదరుడితో సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ సంఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్‌ అయింది. దాడిని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు. ఇక దాడిలో గాయపడ్డ ఎఫ్‌ఆర్వో అనితను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు.

భారీగా మోహరించిన పోలీసులు
సల్సాల గ్రామ అటవీప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ట్రాక్టర్లతో అటవీ శాఖ అధికారులు సోమవారం భూమిని చదును చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 200మంది పోలీసులు మోహరించారు. ఎఫ్‌ఆర్వోపై దాది చేసిన కోనేరు కృష్ణతో పాటు 15మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు