రైతుల రుణాలు బకాయి ఎంత?

25 May, 2014 00:03 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  రుణ మాఫీ లెక్కలపై బ్యాంకులు దృష్టి సారించాయి. ఎన్నికల వేళ అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ ప్రకటించిన నేపథ్యంలో బకాయిదారుల జాబితా సేకరణలో బ్యాంకర్లు నిమగ్నమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అనంతరం తొలి సంతకం రుణమాఫీ ఫైల్‌పైనే చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మరో వారం రోజుల్లో కేసీఆర్ సీఎం పగ్గాలు చేపడుతున్న తరుణంలో రుణాల వివరాల సేకరణలో బ్యాంకులు తలమునకలయ్యాయి.

బ్యాంకులవారీగా రైతుల వివరాలను సేకరించాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) జిల్లాలోని లీడ్ బ్యాంక్ మేనేజర్(ఎల్‌డీఎం)ను ఆదేశించింది. దీంతో రైతులకు అందజేసిన రుణాల సమాచారాన్ని అందజేయాలని అన్ని బ్యాంకులకు ఎల్‌డీఎం లేఖ రాశారు. సోమవారం నాటికి ఈ వివరాలను నివేదించాలని సూచించారు. జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచిన జిల్లాలో అధిక శాతం మంది కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులున్నారు. వీరంతా జిల్లాలోని పలు బ్యాంకుల్లో రుణాలు పొందారు.

 సహకార, ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటిలో కలిసి జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రుణాలు రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చని బ్యాంకర్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. చిన్న, సన్నకారు రైతులు కావడంతో రూ.లక్షకు మించి బ్యాంకు అప్పు తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే కనీసం రూ. 800 కోట్ల వరకూ జిల్లా రైతులకు రుణ మాఫీ జరిగే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెంటనే అమలు చేయాలని భావిస్తుండడంతో దీనిపై సమగ్ర వివరాలను మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు జిల్లా బ్యాంకింగ్ కమిటీ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు