ఆశలు ఆవిరి..

7 Sep, 2017 01:56 IST|Sakshi
ఆశలు ఆవిరి..

76 శాతానికే ఖరీఫ్‌ వరి నాట్లు పరిమితం
సాక్షి, హైదరాబాద్‌:  ఖరీఫ్‌ వరిపై ఆశలు ఆవిరి అవుతున్నాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.65 లక్షల(76 శాతం) ఎకరాలకే పరిమితమైంది. పావు శాతం నాట్లు పడలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌ నెలల్లో రుతుపవనాలు మందగించడం, జలాశయాలు, చెరువులు నిండకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.         

వరదలా పత్తి..
గతేడాది పత్తి సాగు తగ్గడం, మార్కెట్లో ధర అమాంతం పెరగడంతో ఈసారి రైతులు పత్తి పంటకు జై కొట్టారు. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి ఏకంగా 46.52 లక్షల(111 శాతం) ఎకరాల్లో సాగు చేశారు. దీంతో ఈసారి పత్తికి సరైన ధర ఇప్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఇప్పటికే 150 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక సోయాబీన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 5.80 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.12 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1.70 లక్షల ఎకరాలు కాగా, 40 వేల (24 శాతం) ఎకరాలకే పరిమితమైంది.  కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలకుగానూ 6.25 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఖరీఫ్‌లో కంది ఏకంగా 10.77 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం.

నిరాశాజనకమే..
రాష్ట్రంలో పత్తి మినహా ఏ పంటా ఆశాజనకంగా లేదు. ఖరీఫ్‌ ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 39.25 లక్షల(81 శాతం) ఎకరాల్లోనే సాగయ్యాయి. గతేడాది ఖరీఫ్‌లో 48.07 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాలు సాగైతే, ఈసారి 8.82 లక్షల ఎకరాలు తగ్గింది. ఆహారధాన్యాల్లో కీలకమైన పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఖరీఫ్‌లో 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.22 లక్షల(88 శాతం) ఎకరాలకే పరిమితమైంది.

ఈసారి వరికి ఉరే..
వరి సాగు విస్తీర్ణం తగ్గడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్లు, బావుల కిందే వరి నాట్లు పడ్డాయి. జలాశయాలు, చెరువులు నిండకపోవడంతో వరి సాగు పావు శాతానికి తగ్గింది. ఈ సీజన్‌లో జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 40 శాతం లోటు నమోదైంది. ఆగస్ట్‌లో 12 శాతం, సెప్టెంబర్‌లో ఇప్పటివరకు 27 శాతం లోటు రికార్డు అయింది. ప్రస్తుతం కురిసిన వర్షాలు మెట్ట పంటలు గట్టెక్కడానికే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికీ 197 మండలాలు వర్షాభావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. 280 మండలాల్లో సాధారణం, 107 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో వరి నాట్లు పూర్తిస్థాయిలో పడలేదు. నాగార్జున సాగర్‌ పరిధిలోని ఆయకట్టు పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వర్షాలు కురిస్తే ముందస్తు రబీకి వెళ్లాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.

వరి సాధారణ సాగు విస్తీర్ణం       23.35 లక్షల ఎకరాలు
ఖరీఫ్‌లో నాట్లు పడింది            17.65 లక్షల ఎకరాలు
పత్తి సాధారణ సాగు విస్తీర్ణం      41.90 లక్షల ఎకరాలు
ఈసారి పత్తి సాగైంది                46.52 లక్షల ఎకరాలు.

మరిన్ని వార్తలు