‘టీ’యాప్‌తో.. గైర్హాజరుకు చెక్‌!

23 Sep, 2019 10:36 IST|Sakshi

ప్రత్యేక యాప్‌ను రూపొందించిన విద్యాశాఖ

ప్రతీరోజు ఆన్‌లైన్‌లో టీచర్లు, విద్యార్థుల హాజరు

విద్యాశాఖ కమిషనర్‌ ప్రత్యేక దృష్టి

సాక్షి, ఆదిలాబాద్‌: సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా ప్రత్యేకంగా ‘టీ’యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల హాజరు వివరాలు ప్రతిరోజు ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తారు. ఏ పాఠశాలలో హాజరు తక్కువగా ఉంది. ఉపాధ్యాయుల గైర్హాజరుకు గల కారణాలను అడిగి తెలసుకునే వీలుంటుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు, సెల్ఫీ విత్‌ టీచర్‌ అనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా చాలా పాఠశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయకపోవడం, నెట్‌వర్క్‌ సమస్యలు ఉండడంతో సరిగ్గా పనిచేయడంలేదని తెలుస్తోంది. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా.. లేదా అనే విషయాన్ని కూడా ఉన్నతాధికారులు పసిగట్టలేకపోతున్నారు. తప్పించుకునేందుకు కొంతమంది ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌ హాజరును ఉపయోగించడం లేదనే విమర్శలు లేకపోలేదు. గతనెల నుంచి విద్యా శాఖ ‘టీ’ యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్‌తో పాటు జిల్లా విద్య శాఖాధికారులకు అనుసంధానం చేశారు. దీంతో వారు ప్రతిరోజు జిల్లాలో ఎంతమంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఎంత మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. గైర్హాజరును తగ్గించేందుకు విద్యాశాఖ ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

డుమ్మా గురువులపై నజర్‌..
పాఠశాలలకు డుమ్మా కొట్టే గురువులపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే బయోమెట్రిక్, సెల్ఫీ విత్‌ టీచర్‌ అమలు చేస్తోంది. అయితే విద్యా శాఖ కమిషనర్‌ ప్రత్యేక చొరవతో ఈ యాప్‌ను రూపొం దించారు. ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానం ఉండడంతో నేరుగా వివరాలు విద్యా శాఖ కమిషనర్‌ కార్యాలయానికి చేరుతాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఇట్టే తెలిసిపోతుంది. నేరుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, ఎంఈఓలతో మాట్లాడి గైర్హాజరును తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్‌ ఎంఈఓలు లేరు. ఉప విద్యాధికారి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది ఇన్‌చార్జి ఎంఈఓల పనితీరు సరిగా లేకపోవడం, వారు కార్యాలయానికే పరిమితం కావడంతో విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యా కలగానే మారే దుస్థితి నెలకొంది. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు విద్యాశాఖ ఈ యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

జిల్లాలో హాజరు ఇలా..
ఆదిలాబాద్‌ జిల్లాలో 18మండలాలు ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు మొత్తం 1262 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 67,455 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో బాలురు 31,437 మంది, బాలికలు 36,018 మంది ఉన్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 964, ప్రాథమికోన్నత పాఠశాలలు 191, ఉన్నత పాఠశాలలు 112 ఉన్నాయి. గత నెలలో ప్రారంభమైన ఈ ‘టీ’యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 1220 పాఠశాలల్లో ఈ యాప్‌ రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే రోజు 750 నుంచి 800 వరకు మాత్రమే ఉపాధ్యాయులు వివరాలను పొందుపర్చుతున్నారు. 80శాతం వరకు ‘టీ’యాప్‌ ద్వారా హాజరు నమోదవుతోంది. మిగితా పాఠశాలల్లో ఉపాధ్యాయులు వివిధ కారణాలతో వివరాలను నమోదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.

ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మినీ గురుకులాలు, గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఈ యాప్‌ను వినియోగించడం లేదని తెలుస్తోంది. ఆండ్రైడ్‌ ఫోన్లు లేకపోవడం, నెట్‌వర్క్‌ కవరేజీ లేదనే సాకు చూపిస్తూ ‘టీ’యాప్‌లో హాజరు నమోదు చేయడం లేదు. శనివారం 1267 పాఠశాలల్లో 790 పాఠశాలలు మాత్రమే వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. 36,018 మంది బాలికలకు 30,105 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా బాలురు 31,437 మందికి 24,601 మంది పాఠశాలలకు వచ్చారు. జిల్లాలో 81.10 శాతం విద్యార్థుల హాజరు నమోదైంది. అయితే జిల్లాలో 4,602 మంది టీచర్లకు 2,891 మంది టీచర్లు మాత్రమే పాఠశాలలకు వచ్చారు. 82.34 హాజరు శాతం నమోదైంది.

ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌..
‘టీ’యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రైడ్‌ ఫోన్‌లో మాత్రమే ఈ యాప్‌ పనిచేస్తుంది. యుడైస్‌ ఆధారంగా పాఠశాలకు కేటాయించిన కోడ్‌ను అందులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. పాఠశాల పేరు, ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను పొందుపర్చాలి. పాఠశాల మెయిల్‌ ఐడీ, ప్రధానోపాధ్యాయుడి సెల్‌ నంబర్‌ నమోదు చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి 10.30గంటల వరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలి. ఈ వివరాలు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంతో పాటు జిల్లా విద్యశాఖ అధికారి కార్యాలయానికి చేరుకుంటాయి. దీంతో పాఠశాలల వివరాలను క్షణాల్లో ఉన్నతాధికారులు తెలుసుకునే వీలుంది. ‘టీ’ హాజరులో నమోదు చేసిన వివరాలు సరైనవా.. కావా అనేది తనిఖీ చేసినప్పుడు విద్యాశాఖాధికారులకు తెలిసిపోతుంది. తప్పుడు సమాచారం పొందుపర్చితే సంబంధిత ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పకడ్బందీగా అమలు చేస్తాం
‘టీ’యాప్‌ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తాం. 1267 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1220 పాఠశాలలు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. ప్రతిరోజు 800లకు పైగా పాఠశాలలు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. వందశాతం నమోదయ్యే విధంగా చర్యలు చేపడతాం. ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను ఉన్నతాధికారులతో పాటు తాము సైతం తెలుసుకునే అవకాశం ఉంది. – డాక్టర్‌ ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు