‘నా పనిమనిషిలానే ఉన్నావ్‌.. నా కాలు నాకు’

23 Sep, 2019 10:36 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజధానిలోని ఓ ఖరీదైన రెస్టారెంట్‌లో మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. దీని గురించి సదరు మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో నెటిజన్లు రెస్టారెంట్ యాజమాన్యంపై మండి పడుతున్నారు. వివరాలు.. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ తన స్నేహితురాళ్లతో కలిసి దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌ పార్ట్‌-2 ప్రాంతంలోని సైట్‌కార్‌ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఆ ప్రాంతంలో ఇది చాలా పోష్‌ రెస్టారెంట్‌. తమకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్‌ చేసి, స్నేహితులతో మాట్లాడుతుండగా ఇంతలో అక్కడికి కొందరు వ్యక్తులు వచ్చారు. వారు ఈ మహిళల వెనకే కూర్చున్నారు. వారిలో ఓ వ్యక్తి సదరు మహిళకు తాకేలా కూర్చున్నాడు. దాంతో ఇబ్బందికి గురయిన మహిళ వెంటనే లేచి కుర్చిని ముందుకు జరపుకుంది. తర్వాత ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి తన కుర్చి మీద ఎందుకు చేతులు వేశావని ప్రశ్నించింది.

దాంతో ఆ వ్యక్తి పెద్ద గొంతుతో సదరు మహిళలను తిట్టడమే కాక అసభ్య సంజ్ఞలు చేయసాగాడు. అంతేకాక తన కాళ్లను బాధిత మహిళ ముఖం ముందు పెట్టి ‘నువ్వు నా పనిమనిషిలానే ఉన్నావు. మీరంతా దక్షిణ ఢిల్లీకి చెందిన ఆంటీలు.. నా కాలును నాకు’ అంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వాదన ఇలా దాదాపు 25 నిమిషాల పాటు కొనసాగుతూనే ఉంది. సదరు మహిళలు తొలుత దీని గురించి రెస్టారెంట్‌ మేనేజర్‌కి ఫిర్యాదు చేశారు. అతడు మహిళల తరఫున మాట్లాడాడు కానీ ఆ వ్యక్తులను అదుపు చేయలేకపోయాడు. గొడవ ఎంతకు సద్దుమణగకపోవడంతో ఓ మహిళ పోలీసులకు ఫోన్‌ చేసింది. ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండగానే ఆ వ్యక్తులు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. దీని గురించి మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక.. తమతో గొడవపడిని వ్యక్తుల ఫోటోలను ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్‌ చేశారు.

ఈ సంఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ.. తాము పోలీసులకు సహకరిస్తున్నామని.. ఇప్పటికే గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులకు అందించామని పేర్కొంది. మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా సదరు వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా