లాక్‌డౌన్‌ అతిక్రమిస్తే క్రిమినల్‌ కేసులు: డీజీపీ

23 Mar, 2020 12:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా స్వచ్చందంగా బంద్‌ పాటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభణ నేపథ్యంలో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ పాటించాలని సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. అయితే సోమవారం ఉదయం ఎక్కడా లాక్‌డౌన్‌ ప్రభావం అంతగా కనిపించలేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ఈరోజు మధ్యాహ్నం నుంచి లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల షాపులన్నింటినీ అన్ని రాత్రి 7 గంటలకు మూసివేయాలన్నారు. ప్రతీ వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని... ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. జీవో 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశామన్నారు. ఇక మీడియాకు ఎక్కడైనా తిరిగే అనుమతి ఉంటుందని తెలిపారు.(లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉండే సేవలు)

► సోమవారం నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్‌డౌన్ అమలులో ఉంటుంది.

► ఒక కాలనీలో వాహనంలో ఒకటి- రెండు కిలోమీటర్లు మాత్రమే తిరగాలి.

► ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము.

► ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు

► సీజ్ చేసిన వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తరువాత విడుదల చేస్తారు

► ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీ మాత్రమే అనుమతి

► ప్రతి బైక్‌పై ఒక వ్యక్తి... ఫోర్ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే అనుమతి

► చట్టం ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

► ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం

► చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం

► వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలి.

► సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలెవరూ రోడ్లపైకి రాకూడదు

► ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి

►తెలంగాణ సమాజం కోసం పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తారు.

► అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది


పాస్‌పోర్టులు సీజ్‌ చేస్తాం: సోమేశ్‌ కుమార్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోడ్ల మీద ఒక్క వాహనం కనిపించినా చర్యలు తప్పవని తెలంగాణ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1897 చట్టం ప్రకారం లాక్‌డౌన్‌ ప్రవేశపెట్టామని.. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల సరిహద్దులను మూసివేశామని తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఐదుగురు వ్యక్తులకు మించి రోడ్లపై ఒకేచోట కనపడకూడదని.. జీవో ప్రకారం కొన్ని సేవలపై మినహాయింపు ఇచ్చామని తెలిపారు. గ్రామ స్థాయిలో కరోనా వ్యాప్తి తీవ్రత అంతగా లేదని పేర్కొన్నారు. అయితే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు తప్పకుండా క్వారంటైన్‌ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. ఎన్నారైలు చర్యలు అతిక్రమిస్తే పాస్‌పోర్టులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రకృతి విపత్తు సహాయక శాఖ అధికారులు ఎల్లప్పుడూ విధులను కొనసాగిస్తారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని సోమేశ్‌ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు