10 నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

14 May, 2019 01:51 IST|Sakshi

ఈనెల 27 వరకు ఫీజు చెల్లించే అవకాశం 

రీకౌంటింగ్‌ రీవెరిఫికేషన్‌ కోసం 15 రోజులు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేనెల 10 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. జూన్‌ 10 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమై 24న ముగుస్తాయి. రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం12.15 గంటలకు ముగుస్తుంది. పరీక్షలకు సమయం తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోసం ఎదురుచూడొద్దని ప్రభుత్వం సూచించింది. అడ్వాన్స్‌ సప్లిమెంటరీకి సంబంధించి ఫీజు చెల్లింపు గడువు ఈనెల 25 వరకు ఉంది.

ఈనెల 29న పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాల యాజమాన్యం ట్రెజరీలో జమచేసి ఈ నెల 31 నాటికి జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయానికి కంప్యూటర్‌ ఎక్స్‌ట్రాక్ట్స్‌ సమర్పించాలని, వీటిని జూన్‌ 3లోగా జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రభుత్వ పరీక్షల విభాగానికి సమర్పించాలని స్పష్టం చేసింది. అపరాధరుసుము రూ.50తో పరీక్షలకు రెండ్రోజుల ముందు వరకు చెల్లించే వెసులుబాటు కల్పించినా గడువు తేదీలోగా చెల్లించాలని విద్యార్థులకు సూచించింది. 

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోసం.. 
పదోతరగతి పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోసం ఫలితాలు వెలువడిన నాటి నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌ చేయించాలనుకుంటే ప్రతి సబ్జెక్టుకు రూ.500 చొప్పున ప్రభుత్వ ఖజానా హెడ్‌ అకౌంట్‌టో నిర్దేశిత హెడ్‌లలో చెల్లించాలి. లేదా డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్, తెలంగాణ, హైదరాబాద్‌ కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్‌ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున చలానా కట్టాలి.

దరఖాస్తు పత్రాన్ని  www. bse. telangana. gov. in లేదా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచించింది. డిమాండ్‌ డ్రాఫ్ట్‌లను అంగీకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రీవెరిఫికేషన్‌ కేటగిరీలో రీటోటలింగ్, అన్ని జవాబులకు మార్కులు వేశారా లేదా చూస్తారు. మూల్యాంకనం చేయని జవాబులను తిరిగి లెక్కిస్తారు. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని సూచించింది.

మరిన్ని వార్తలు