ట్రిబ్యునల్ ముందు ఇక తాడో.. పేడో!

24 Mar, 2015 03:10 IST|Sakshi
 • 30వ తేదీ నుంచి బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు తెలుగు రాష్ట్రాల వాదనలు
 • సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల కేటాయింపులపై తాడో, పేడో తేల్చుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. విభజన అనంతరం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు తొలిసారి అవకాశం రావడంతో ఇరు రాష్ట్రాలు తమ స్వరం పెంచి, వాస్తవికతను ముందుపెట్టాలనే కృత నిశ్చయంతో ఉన్నాయి.

  కృష్ణా జలాల కేటాయింపును పూర్తిగా సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు కొత్తగా నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ, ఏపీ పట్టుబట్టనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలు ఇప్పటికే తమ వాదనలు పూర్తి చేసినందున, ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు వరుసగా జరిగే సమావేశాల్లో వాదనలు కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితం కానున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ట్రిబ్యునల్ ముందు సరైన వాదనలు లేక కష్ణా జలాల్లో తగిన వాటా దక్కలేదని భావిస్తున్న తెలంగాణ రాష్ట్రం, గతంలో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరుతోంది.

  ఇప్పటికే తన వాదనలను పటిష్టంగా వినిపించడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో ఢిల్లీలో చర్చలు సైతం జరిపింది. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పును గెజిట్‌లో ప్రచురించాలని, ప్రస్తుత విచారణను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని గత వాదనల సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటకలు స్పష్టం చేశాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1001 టీఎంసీల నీటిని ప్రాజెక్టుల వారీగా పంచాలని, తమకు కేటాయించిన నీటి జోలికి రావద్దని విన్నవించాయి. ఈ వాదనను తెలుగు రాష్ట్రాలు అంగీకరించడంలేదు.

  కృష్ణా నదీ జలాలను నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు కేటాయింపులు సైతం నాలుగు రాష్ట్రాల మధ్య జరగాలని కోరుతున్నాయి. దిగువ ప్రాంతాలకు నీటి లోటు ఉన్నప్పుడు ఎగవ నుంచి నీటి విడుదల ఎలా ఉండాలన్నది తేలాలన్నా నాలుగు రాష్ట్రాలను కలిపి విచారించాలని తెలంగాణ కోరుతోంది.
   
  అదనపు జలాలు కోరుతున్న తెలంగాణ

  కొత్త ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే ప్రాజెక్టులకు, ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయింపులను పెంచాలన్నది తెలంగాణ వాదనగా ఉంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని, ఇక్కడ అవసరమైతే కోతలు పెట్టి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరిన్ని కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.  గతంలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపులకై విజ్ఞప్తి చేసినా, ట్రిబ్యునల్ పట్టించుకోని దృష్ట్యా, ఇప్పుడు పునఃసమీక్ష చేసి కేటాయింపులు చేయాలని కోరుతోంది. పాలమూరు, జూరాల-పాకాల  ఎత్తిపోతలకు 130 టీఎంసీల మేర నీటి కేటాయింపుల అభ్యర్థనకై నివేదిక సిద్ధం చేసింది. స్థూలంగా మిగులు జలాలు, నికర జలాలు కలుపుకొని మొత్తంగా మరో 382 టీఎంసీల మేర అదనపు కేటాయింపులు కోరేలా వాదనలు సిద్ధం చేశారు.
   
  ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం..

  గతంలో జరిగిన ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్‌కు, రాయలసీమలోని సుంకేశుల కేసీ కెనాల్‌కు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా, ఆర్డీఎస్‌కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గట్టిగా చెప్పాలని తెలంగాణ భావిస్తోంది. తుంగ భద్ర కెనాల్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు 16 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ప్రయత్నం జరగని విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు.

మరిన్ని వార్తలు