జగ్గారెడ్డి బ్రేస్‌లెట్‌కు రూ.20 లక్షలు

17 Jun, 2017 02:06 IST|Sakshi
బ్రేస్‌లెట్‌ను కృషి బిల్డర్స్, డెవలపర్స్‌ డైరెక్టర్‌ మహేందర్‌రెడ్డికి అందజేస్తున్న కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి. చిత్రంలో వీహెచ్‌
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ మాజీ విప్‌ టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) తన బంగారు బ్రేస్‌లెట్‌ను వేలం వేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన వేలంపాటలో కృషి బిల్డర్స్‌ ప్రతినిధులు 20 లక్షలు వెచ్చించి దానిని సొంతం చేసుకున్నారు. మెదక్‌ ఏడుపాయల దుర్గమ్మ తల్లి పేరుతో రూ.5 లక్షలకు ప్రారంభమైన వేలంపాట 20 లక్షలతో ముగి సింది. జూన్‌ 1న సంగారెడ్డిలో జరిగిన సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన సూచనతో సభ ఖర్చుల కోసం జగ్గారెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఈ బ్రేస్‌లెట్‌ను ఇచ్చారు. బ్రేస్‌లెట్‌ను వేలం వేసి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇవ్వాలని జగ్గారెడ్డి నిర్ణయించారు.

రైతులకోసం బ్రేస్‌లెట్‌ అని తెలియగానే ఈ వేలంపాటకు హాజరయ్యానని కృషి బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ డైరెక్టర్‌ గిరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతులను ఆదుకోవడానికి రూ.20 లక్షలకు కొనుగోలు చేసినట్టుగా వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో 11 మంది రైతులకు, వరంగల్‌ జిల్లాలో9 మంది రైతులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పు న రూ.20 లక్షలను పంపిణీ చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. టీపీసీసీ తరఫున రైతులను ఆదుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు.

వేలంపాటలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బ్లాక్‌మెయిల్‌ చేయాలని మంత్రి హరీశ్‌రావు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రలకు దిగుతున్నదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముక్కును నేలకు రాపిస్తామని హరీశ్‌ మాట్లాడుతున్నాడని, ఉత్తమ్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం 
అవుతుందని హెచ్చరించారు.
మరిన్ని వార్తలు