నాలుగేళ్లలో రూ. 1.20 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యం

3 Jun, 2015 02:08 IST|Sakshi
నాలుగేళ్లలో రూ. 1.20 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యం

ఐటీ శాఖ వార్షిక నివేదిక విడుదలలో మంత్రి కేటీఆర్ వెల్లడి
సాక్షి,హైదరాబాద్: వచ్చే నాలుగేళ్లలో ఐటీ పరిశ్రమ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఐటీ శాఖ రూపొందించిన టీ-హబ్ లోగోను, వెబ్‌సైట్‌ను, వార్షిక నివేదికను మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడు తూ.. తెలంగాణ ఏర్పడ్డాక పరిశ్రమలు తరలి పోతాయని ఎంతోమంది దుష్ర్పచారం చేశారని, అయితే రాష్ట్రంలో ఐటీ సహా అన్ని పరిశ్రమలకు గత ఏడాది కాలంలో సుస్థిర తను కల్పిం చగలిగామన్నారు. ప్రతిఏటా పారదర్శకంగా ఐటీ వార్షిక నివేదికను విడుదల చేసి ప్రజలకు తాము సాధించిన పురోగతిని, లక్ష్యాలను తెలపడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు.
 
పది పాయింట్ల ఎజెండాతో: సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధితో పాటు ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ రంగంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని కేటీఆర చెప్పారు. మొబైల్, ఎల్‌ఈడీ, సోలార్, చిప్ తయారీ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ రంగాల్లో పరిశ్రమల స్థాపన ద్వారా ఐటీఐ, డిప్లొమో చదివిన వారికీ మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను అభివృద్ధి చేసేందుకు పది పాయింట్ల ఎజెండాతో ముందుకెళ్తున్నామన్నారు.

స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ-హబ్‌ను 15 రోజుల్లోగా ప్రారంభిస్తామన్నారు.
 ఎం-గవర్నెన్స్‌తో పౌర సేవలు: మొబైల్ ద్వారా పౌరులకు ఉత్తమ సేవలను అందించే విధంగా ఎం- గవర్నెన్స్‌ను తెచ్చేందుకు కృషిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తన అమెరికా పర్యటన సందర్భంగా.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన నిపుణులను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరినట్లు తెలిపారు. గచ్చిబౌలిలో త్వరలోనే ఎంఎస్‌ఎంఈ టవర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ను దేశంలోనే (ఢిల్లీ తర్వాత) రెండవ ఉత్తమ నగరంగా, సామాజిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు