నిస్వార్థ సేవకుడు వర్ధెల్లి బుచ్చిరాములు 

7 Feb, 2020 02:23 IST|Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి 

సూర్యాపేట: తాను పట్టిన ఎర్రజెండాను విడనాడకుండా చనిపోయేంత వరకు పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసిన స్వార్థం లేని నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్‌ క్లబ్‌లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుచ్చిరాములు ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ, తన జీవితానంతా పేదల కోసం ధారపోసిన కమ్యూనిస్టు యోధుడు బుచ్చిరాములు అని, నమ్మిన సిద్ధాంతం కోసం ఏనాడూ రాజీపడని వ్యక్తి అని కొనియాడారు. సమసమాజ స్థాపనకు నాటి సాయుధ పోరాటం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు పోరాడిన ఏకైక వ్యక్తిగా నిలిచారన్నారు.

రాజకీయాల్లో విలువలు తగ్గుతున్నా, తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి సమాజసేవకు పాటుపడ్డారని కొనియాడారు. బహుజన రాజ్యాధికారం సాధించేందుకు పునాది వేసి పోరాటాలు నడిపారన్నారు. బీఎన్, ధర్మభిక్షం, నల్లా రాఘవరెడ్డిలు తొలితరం పోరాట నాయకులుగా కొనసాగితే .. రెండోతరాని కి బుచ్చిరాములు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరాములు కుమారుడు, సాక్షి ఎడిటర్‌ వర్ధెల్లి మురళి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు