14 మంది మృతదేహాలకు ఒకే చోట ఖననం

13 May, 2019 07:28 IST|Sakshi
కర్నూలు ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద వేచి ఉన్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు (ఇన్‌సెట్‌)లో అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు

అలంపూర్‌/ శాంతినగర్‌/రాజోళి: వెల్దుర్తి ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి రామాపురంలో కన్నీటి వీడ్కోలు పలికారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు.. ఆప్తుల ఆర్తనాదాలతో గ్రామం శోకసంద్రాన్ని తలపించింది. రాజోళి మండలం పచ్చర్ల వాసి తుపాన్‌ డ్రైవర్‌ రంగస్వామి (40), వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన విజయ్‌తో పాటు శాలన్న (32), గోపీనాథ్‌ (21), చింతలన్న (60), తిక్కయ్య (38), పౌలన్న (45), కృష్ణ (30), నాగరాజు (35), రాముడు (55), భాస్కర్‌ (41), చిన్న సోమన్న (45), పరశురాముడు (28), మునిస్వామి (35), సురేష్‌ (28), వెంకట్రాముడు (41) అదే గ్రామానికి చెందిన శ్రీనాథ్‌ వివాహ నిశ్చయానికి శనివారం అనంతపురం జిల్లా గుంతకల్‌కు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వారు స్వగ్రామానికి తుపాన్‌ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం విదితమే. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపలైన విజయ్‌ ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్‌లో రామాపురం తీసుకొచ్చారు. అక్కడ అందరికీ సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.

కడసారి ఇంటికి రాకుండానే.. 
మృతి చెందిన వారిని కడసారి ఇంటికి తీసుకురాకుండా నేరుగా శ్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివాహ నిశ్చయానికని ఇంటి నుంచి బయల్దేరిన వారు మృతి చెందిన తర్వాత ఇళ్లకు తీసుకురాలేకపోయారు. గ్రామంలో శ్మశానవాటిక చిన్నదిగా ఉండటంతో కష్టంగా మారింది. చివరకు కలెక్టర్‌ శశాంక ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు గ్రామంలోకి ప్రవేశించే చోట టెంట్లు వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు కడసారి చూపు చూసుకునే అవకాశం కల్పించారు. సమీపంలోనే అధికారులు జేసీబీతో ఏర్పాటుచేసిన గుంతల్లో మృతదేహాలను ఖననం చేయించారు. దీంతో మృతులు నివాసం ఉండే కాలనీలు నిర్మానుష్యంగా మారాయి. అక్కడ జనసంచారం లేకుండా బిక్కుబిక్కుమంటూ కనిపించాయి.

కొత్త శ్మశానవాటికలో.. 
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి కొత్త శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలోని పాత శ్మశానవాటిక చిన్నగా ఉడటంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందిగా మారింది. దీంతో గ్రామస్తులు ఎప్పటి నుంచో శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ వచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం 14 మంది అంత్యక్రియలు నిర్వహించడం అక్కడ సమస్యగా ఉంటుందని భావించిన స్థానిక రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామ శివారులోని సర్వే నం.326లో 4.1 ఎకరాలను గుర్తించారు. ఈ స్థలం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎంపిక చేసినా కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందులోని ఎకరాను శ్మశానవాటిక కోసం కేటాయించారు. కొత్తగా ఏర్పాటుచేసిన స్థలంలోనే మృతి చెందిన వారి అంత్యక్రియలు పూర్తి చేశారు.  

బంధువుల సూచన మేరకు..

ఈ సంఘటనలో మృతి చెందిన 14 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. బంధువుల సూచనల మేరకు ఎవరు ఎవ రి పక్కన ఖననం చేయాలనేది కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు అంత్యక్రియ లు నిర్వహించారు. 13 మందిని పక్క పక్కన, మరొకరిని కొంతదూరంలో ఖననం చేశారు. ముందుగా చింతలన్న, తిక్కన్న, మునిస్వామి, పరశురాముడు, చిన్న సోమ న్న, నాగరాజు, రాముడు, సురేష్, గోపీనా థ్, శాలన్న, కృష్ణ, భాస్క ర్, వెంకట్రాముడును ఒకరి తర్వాత ఒకరిని ఖననం చేయగా పౌలన్నను మాత్రమే సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు