‘కడెం’ వెలవెల

17 Jul, 2014 00:43 IST|Sakshi

 కడెం : వర్షాకాలం వచ్చింది.. సగం కాలం గడిచింది.. కార్తెలూ వస్తున్నాయి.. అయిపోతున్నాయి. కానీ కాలం కావడం లేదు. వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. కడెం ఆయకట్టు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగితా ప్రాంతాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఇదే సమయానికి కడెం ప్రాజెక్టు ఆయకట్టు అంతా పచ్చదనంతో కళకళలాడింది. పచ్చని పొలాలతోఎటు చూసినా భూములున్నీ సాగులో ఉన్నాయి. ఈసారి వర్షాభావ పరిస్థితులతో ఎటు చూసినా భూములు బీడువారి కనిపిస్తున్నాయి.

 కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద కడెం, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలు ఉన్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్‌లో కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు కింద 85 వేల ఎకరాలు సాగు అవుతోంది. ప్రాజెక్టు కింద 87 వరకు చెరువులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్నాయి. గత ఏడాది ప్రాజెక్టులో ఇదే సమయానికి 700 అడుగుల నీటిమట్టం ఉంది. చాలాసార్లు వదర గేట్లు ఎత్తి నీటిని వృథాగా గోదావరినదిలోకి వదిలారు. ప్రస్తుతం నీటిమట్టం పూర్తిగా పడిపోయింది.

సోమవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు నీటిమట్టం 680 అడుగులుగా ఉంది. కనిష్ట నీటిమట్టం 675 అడుగులు. జలాశయంలో కేవలం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది మండలంలోని ఆయకట్టు కింద ఖరీఫ్‌లో 17,654 ఎకరాలు సాగయ్యాయి. పత్తి, వరి, మొక్కజొన్న, పసుపు తదితర పంటలు సాగు చేస్తుంటారు. ఈసారి వ్యవసాయ పనులు ఇంకా ముందుకు సాగడం లేదు. వర్షాలు కురుస్తాయనే ఆశతో ఆయకట్టు రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు సిద్ధం చేసుకుని ఉన్నారు.

 ఆకాశం మేఘావృతం అవుతోంది.. కానీ వర్షాలు పడడం లేదు. మబ్బులు తేలిపోతూ రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో వర్షాల కోసం రైతులు కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. మరి కొందరు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ఆయకట్టు కింద ఇదే దుస్థితి 2008లోనూ ఎదురైంది. వర్షాకాలం చివరలో కష్టంగా ప్రాజెక్టు నిండింది. 

మరిన్ని వార్తలు