సగంలో సగమే!

6 Mar, 2019 06:37 IST|Sakshi

పట్టభద్రుల ఓటర్ల జాబితాలో మహిళలు తక్కువే 

ఉమ్మడి జిల్లాలో 24,076 మంది పురుష ఓటర్లు  

11,681 మంది స్త్రీలకే  ఓటు హక్కు

ఓటరు నమోదుపై ఆసక్తి చూపని అతివలు 

మహిళలు మగవారికి దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్య, ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లోనూ దూసుకుపోతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడంలో మాత్రం వెనుకబడ్డారు. సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉత్సాహం చూపిన మహిళలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓటరుగా నమోదు చేయించుకోవడంపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. 

సాక్షి, కామారెడ్డి: కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 22న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటరు జాబితాలో పురుషుల కన్నా మహిళల ఓట్లు చాలా తక్కువ గా ఉన్నాయి. ఇటీవల జరిగిన అ సెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల కోసం తయారు చేసిన జాబితాల్లోనూ వారి ఓట్లే ఎక్కువ.. మహిళలు ఓ రకంగా అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో మాత్రం మహిళల ఓట్లు పురుషుల సంఖ్యలో సగం కూడా లేకపోవడం గమనార్హం.  
కరీంనగర్‌– ఆదిలాబాద్‌– మెదక్‌– నిజామాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం ఓటర్లు 35,764 మంది ఉన్నారు. ఇందులో పురుషుల ఓట్లు 24,076 ఉండగా.. మహిళలవి 11,681 మాత్రమే ఉన్నా యి. పురుషులకన్నా 12,395 ఓట్లు తక్కువగా ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లా జనాభాలో మహిళలు పురుషులకన్నా ఎక్కు వ మందే ఉన్నారు. అలాగే సాధారణ ఓటరు జాబితాలో కూడా వారి సంఖ్యే ఎక్కువ.. కానీ పట్టభద్రుల విషయానికి వచ్చే సరికి మహిళలు మగవారిలో సగం కూడా ఓటర్లుగా నమోదు కాలేదు. కామారెడ్డి జిల్లాలో మరీ తక్కువగా ఉన్నారు. ఇక్కడ 7,324 మంది పురుషులకు ఓటు హక్కు ఉంటే.. 2,928 మంది మహిళలకే ఓటు హక్కు ఉంది. పురుష ఓటర్లలో మూడోవంతు కూడా మహిళా ఓటర్లు లేకపోవడం గమనార్హం.

కారణం ఏమై ఉంటుంది? 

మహిళలు అన్నింటా దూసుకుపోతున్న నేటి రోజుల్లో పట్టభద్రుల ఓటర్ల జాబితాలో వారి సంఖ్య తగ్గడానికి కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది మహిళలు ఉన్నత విద్యాభ్యాసం చేసినవారున్నారు. అలాగే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారూ ఉన్నారు. అయినా వారు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఓటరు నమోదుకు మహిళలు ఆసక్తి కనబర్చలేకపోవడం, వారిని ప్రోత్సహించకపోవడం మూలంగానే ఎక్కువమంది ఓటర్లుగా నమోదు కాలేదన్న విషయం స్పష్టమవుతోంది. మహిళా పట్టభద్రుల విషయంలో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో వారు ఓటరు నమోదుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

ఉమ్మడిజిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు..

జిల్లా  పురుషులు  మహిళలు    ఇతరులు     మొత్తం 
కామారెడ్డి    7,324   2,928  01   10,253
నిజామాబాద్‌ 16,752   8,753  06  25,511
మొత్తం     24,076  11,681     07   35,764 

మరిన్ని వార్తలు