నలుగురు మావోల ఎన్‌కౌంటర్‌

18 Aug, 2016 04:07 IST|Sakshi
నలుగురు మావోల ఎన్‌కౌంటర్‌

-ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
-మృతుల్లో ఓ మహిళ సహా ఇద్దరు కమాండర్లు
చింతూరు/రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య సుమారు రెండు గంటలపాటు హోరాహోరీగా ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దళ కమాండర్లు సహా నలుగురు మావోయిస్టులు మతి చెందారు. దంతెవాడ జిల్లాలోని కట్టేకల్యాణ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్‌జీ బలగాలు మంగళవారం రాత్రి కూంబింగ్‌కు బయలుదేరగా బుధవారం తెల్లవారుజామున దబ్బ, కున్నా గ్రామాల సమీపంలోని అడవిలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు.

పోలీసు బలగాలను చూడగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆ ప్రాంతంలో నలుగురు మావోయిస్టుల మతదేహాలు లభించినట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ శివరాంప్రసాద్‌ కల్లూరి తెలిపారు. ఘటనాస్థలం నుంచి నాలుగు .303 రైఫిళ్లు, రెండు 315 తుపాకులు, రెండు 12 బోరు తుపాకులు, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను తరలించేందుకు వాడే 30 బ్యాగులు, మావోయిస్టులకు సంబంధించిన వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.

మృతుల్లో ఇద్దరిని ప్లాటూన్‌ కమాండర్‌ మడకం దేవి, కట్టేకల్యాణ్‌ ఏరియా కమాండర్‌ మాసాగా గుర్తించామని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. 2013లో జీరమ్‌ లోయ వద్ద ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రి మహేంద్ర కర్మ, నాటి రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నంద్‌ కుమార్‌ పటేల్, సీనియర్‌ నేత వీసీ శుక్లా సహా 27 మంది ప్రయాణిస్తున్న వాహనాలపై మెరుపు దాడి చేసి హతమార్చిన మావోయిస్టుల్లో మాసా ఒకరు. కాగా, ఎన్‌కౌంటర్‌లో డీఆర్‌జీకి చెందిన ఓ జవాను గాయపడ్డాడని...చికిత్స నిమిత్తం అతన్ని హెలికాప్టర్‌లో జగ్దల్‌పూర్‌కు తరలించామన్నారు. ఎదురుకాల్పుల అనంతరం అదనపు బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.

>
మరిన్ని వార్తలు