మోడీది.. కోటీశ్వరుల కేబినెట్

30 May, 2014 02:19 IST|Sakshi

* కోట్లకు పడగలెత్తిన 40 మంది అమాత్యులు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కోటీశ్వరులతో నిండిపోయింది. ప్రధాని సహా మొత్తం 46 మంది అమాత్యులున్న కేబినెట్‌లో 40 మంది రూ. కోట్లకు పడగలెత్తగా కేవలం నలుగురు మాత్రమే లక్షాధికారులుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న సంపదల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది.

ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన అరుణ్ జైట్లీ సహా మంత్రులు గోపీనాథ్ ముండే, మేనకా గాంధీ, పీయూష్ గోయల్ ఇలా 40 మంది మంత్రి వర్యులు కోటీశ్వరులేనని ఏడీఆర్ పేర్కొంది. కాగా, ధాంజీభాయి వాసవ రూ.65 లక్షలు, థావర్‌చంద్ గెహ్లాట్ రూ.86 లక్షలు, సుదర్శన్ భగత్ రూ.90 లక్షలు, రాం విలాస్ పాశ్వాన్ రూ.96 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారని వివరించింది. ఇక, మరో ఇద్దరు మంత్రులు ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్‌లు ఏ సభకూ ఎన్నిక కాకపోవడంతో వీరి ఆస్తుల వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు