బిర్యానీలో గొడ్డు మాంసం

9 Sep, 2016 11:36 IST|Sakshi
బిర్యానీలో గొడ్డు మాంసం
బిర్యానీ శాంపిల్స్లో గొడ్డుమాంసం(బీఫ్) ఉన్నట్టు తేలింది. హర్యాణాలోని మెవాత్ జిల్లాలో సేకరించిన రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ బిర్యానీలో బీఫ్ను గుర్తించినట్టు హిసార్లోని లాలా లజ్పత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నిటీ, యానిమల్ సైన్సెస్ నిర్ధారించింది. సేకరించిన ఏడు బిర్యానీ శాంపిల్స్లో బీఫ్ ఉన్నట్టు యూనివర్సిటీ అధికార వర్గాలు చెప్పాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శక్తికాంత్ శర్మ ఈ ల్యాబోరేటరీ రిపోర్టును ప్రభుత్వానికి పంపించినట్టు వెల్లడించారు. పలు హోటళ్లలో బీఫ్ బిర్యానీ తయారుచేస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం బిర్యానీ శాంపిళ్లు సేకరించి పరిశీలించాలని ఆదేశాలను జారీచేసింది. 
 
ఈ ఆదేశాల మేరకు మెహతా పోలీసులు ఫుడ్ స్టాళ్లలో ఏడు బిర్యానీ నమూనాలను సేకరించి ల్యాబ్ టెస్ట్కు పంపారు. సేకరించిన ఈ ఏడింటిలోనూ బీఫ్ పాజిటివ్ అని తేలినట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెటర్నిటీ ల్యాబ్ తెలిపింది. ఇది తీవ్రమైన నేరంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తితే ఎక్కువ శాంపిళ్లను సేకరించి పరిశీలిస్తామని మెవాత్ పశుగణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు తదుపరి చర్యలకు సమాయత్తమవుతున్నారు. బిర్యానీల్లో గొడ్డు మాంసాన్ని నిరోధించేందుకు టాస్క్ ఫోర్స్ సహాయంతో హోటళ్లలో బిర్యానీలను పరిశీలిస్తామని నోడల్ ఆఫీసర్ భారతీ అరోరా తెలిపారు. అయితే మైనార్టీ కమ్యూనిటీని అవమానిస్తున్నారంటూ హర్యానా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఫ్తాబ్ అహ్మద్ విమర్శిస్తున్నారు.
మరిన్ని వార్తలు