కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు.. | Sakshi
Sakshi News home page

కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు..

Published Fri, Sep 9 2016 11:27 AM

కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు..

యూరప్ లోని అత్యంత ఎత్తైన మౌంట్ బ్లాంక్ పర్వత ప్రాంతంలో కేబుల్ కార్లు చిక్కుకుపోయాయి. దీంతో సుమారు 45 మంది రైడర్లు పర్వతాల మధ్య రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేబుల్ కార్లలో చిక్కుకు పోయిన 45 మందికి తోడు... వారికి సహాయం అందించేందుకు వెళ్ళిన రెస్క్యూ సిబ్బంది సహా 65 మంది రాత్రంతా కార్లలోనే గడపాల్సి వచ్చింది.

రెండు పర్వత శిఖరాల మధ్య రైడ్ కోసం వెళ్ళిన అధిరోహకులు..  రాత్రంతా ఒంటరిగా కేబుల్ కార్లలోనే చిక్కుకుపోయినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. ఎత్తైన పర్వత ప్రాంతంలో చిక్కుకున్న కేబుల్ కార్లలో రాత్రంగా బిక్కుబిక్కుమంటూ గడిపిన 45 మంది అధిరోహకులను నాలుగు హెలికాప్టర్ల సహాయంతో సుమారు 20 మంది కార్మికులు కాపాడినట్లు హోంమంత్రి బెర్నార్డ్ కెజెన్యూవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్రాన్స్, ఇటలీ సరిహద్దుల్లోని సుమారు 3000 మీటర్ల ఎత్తులో ఉన్న ఐగ్విల్లే డు మిడి, హెల్ బ్రోనర్ శిఖరాల మధ్య  5 కిలోమీటర్ల రైడ్ కోసం వారంతా అక్కడకు చేరుకున్నారు. అయితే సాధారణంగా ఈ ప్రయాణం 35 నిమిషాల్లో పూర్తవ్వాల్సి ఉంది. కాగా  సాయంత్రం 5.30 ప్రాంతంలో కేబుల్ కార్లు స్టక్ అయిపోవడంతో రాత్రంతా  రైడర్లు కార్లలోనే ఇరుక్కుపోయారు. కార్లలో చిక్కుకున్న వారికి దుప్పట్లు, ఆహారం వంటివి నాలుగు హెలికాప్టర్ల ద్వారా అందించిన సుమారు 20 మంది రెస్క్యూ వర్కర్లు కూడా... రాత్రంతా వారితోపాటే ఉండిపోయారు.

పర్వత ప్రాంతంలో భారీగా వచ్చిన గాలులకు తీగలు చిక్కుపడి పోవడంతో కేబుల్ కార్లు స్టక్ అయిపోయాయని ఫ్రాన్స్ లోని ఓ మీడియా సంస్థ తెలిపింది. అయితే సాంకేతిక కారణాలవ్ల సమస్య ఏర్పడినట్లు తెలిపిన కెజెన్యూవ్.. పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

Advertisement
Advertisement