సియాచిన్‌లో పాక్‌ హడావుడి!

24 May, 2017 13:53 IST|Sakshi
సియాచిన్‌లో పాక్‌ హడావుడి!

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ వైమానిక దళానికి చెందిన మిరేజ్‌ తరహా యుద్ధ విమానాలు సరిహద్దుల్లోని సియాచిన్‌ గ్లేసియర్‌ సమీపంలో తిరిగినట్లు ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించడం కలకలం రేపింది. భారత భూభాగంలో ఉన్న సియాచిన్‌ ప్రాంతం సమీపంలో పాక్‌ వైమానిక దళ చీఫ్‌ తిరిగారని మీడియా చెప్పుకొచ్చింది. అయితే, ఈ కథనాలను భారత వైమానిక దళం నిర్ద్వంద్వంగా ఖండించింది. సియాచిన్‌లోని భారత గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది.

పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌ సోహైల్‌ అమన్‌ సరిహద్దుల్లోని స్కర్దు ప్రాంతంలో ఉన్న ఖాద్రి వైమానిక స్థావరాన్ని సందర్శించారని పాక్‌ మీడియా పేర్కొన్నది.ఇక్కడ ఫైటర్‌ జెట్‌ వైమానిక దళం యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నది. ఇక్కడ ఉన్న తమ ఎయిర్‌ఫోర్స్‌ స్థావరాలన్నింటినీ భారత ముప్పును ఎదుర్కొనేందుకు పాక్‌ క్రియాశీలం చేసినట్టు మీడియా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పాక్‌ ఎయిర్‌ చీఫ్‌ అమన్‌ తానే స్వయంగా మిరాజ్‌ జెట్‌ విమానాన్ని నడుపుతూ.. సియాచిన్‌ సమీపంలోకి చొచ్చుకొచ్చినట్టు కథనాలు వండివార్చింది. ఈ కథనాలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

మిలిటెంట్ల చొరబాట్లకు నేరుగా సహకరిస్తూ కాల్పులకు దిగుతున్న పాక్‌ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోని పాక్‌ సైనిక పోస్టు భారత్‌ ఆర్మీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళాలు పాక్‌ సైనిక పోస్టుపై దాడులు నిర్వహించిన వీడియోను ఆర్మీ విడుదల చేసింది. అయితే, ఈ దాడిని తోసిపుచ్చుతున్న పాక్‌.. తాజా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరించాలనుకోంటోంది. ఈ నేపథ్యంలోనే సియాచిన్‌ గగనతలంలోకి తమ విమానాలు వచ్చాయంటూ కథనాలు ప్రచురించడం గమనార్హం.

పాకిస్తాన్‌తో యుద్ధం?

మరిన్ని వార్తలు