అమిత్ షాకు ఇంకా చాన్స్ ఉన్నట్లేనా?

4 Aug, 2016 11:45 IST|Sakshi
అమిత్ షాకు ఇంకా చాన్స్ ఉన్నట్లేనా?

గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ రాజీనామా చేయడంతో.. కొత్త ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గురువారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తన ఇంటికి వెళ్లారు. అక్కడ పార్టీ సంయుక్త కార్యదర్శి వి.సతీష్, గుజరాత్ వ్యవహారాల ఇన్‌చార్జి, ప్రధాన కార్యదర్శి దినేష్ శర్మలతో సమావేశమయ్యారు. త్వరలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల ఈ కీలక తరుణంలో అమిత్ షాను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లేనే లేదని పార్టీ అధిష్ఠానం బుధవారమే స్పష్టం చేసింది.

అయినా, గుజరాత్ ఆయన సొంత రాష్ట్రం కావడంతో.. సీఎం చేసే చాన్స్ ఉందని కొందరు నాయకులు అంటున్నారు. గుజరాత్ ఎమ్మెల్యేలు మాత్రమే తమ నాయకులెవరన్నది ఎన్నుకుంటారని వెంకయ్యనాయుడు చెప్పారు. కానీ.. ఒకవేళ ఇప్పటికే పోటీలో ఉన్న పటేళ్ల కంటే అమిత్ షా వైపు మొగ్గు ఎక్కువగా ఉందని, అందువల్ల ఎమ్మెల్యేలు ఆయననే ఎన్నుకున్నారని తర్వాత చెప్పుకోవచ్చని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. సాధారణంగా లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదని.. కానీ ఈసారి మాత్రం శుక్రవారం సాయంత్రం జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని ఇలా ఎందుకు జరుగుతోందోనని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమిత్ షా అహ్మదాబాద్ నగరంలోని నారన్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో గెలిచారు. అందువల్ల ఆయనను సీఎం చేయడానికి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు.

మరిన్ని వార్తలు