'పోకెమాన్ గో' ఆడితే రూ.3 లక్షల బిల్లు..! | Sakshi
Sakshi News home page

'పోకెమాన్ గో' ఆడితే రూ.3 లక్షల బిల్లు..!

Published Thu, Aug 4 2016 11:53 AM

'పోకెమాన్ గో' ఆడితే రూ.3 లక్షల బిల్లు..!

రియోడీజెనీరో: ప్రపంచ వ్యాప్తంగా పోకెమాన్ గో గేమ్ ఫీవర్ కారణంగా ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈ గేమ్ పిచ్చితో దేశాల సరిహద్దులు దాటిన వారు కొందరైతే, ఆడుకుంటూ పోయి దాదాపు ప్రాణాల మీదికి కొందరు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. రియోలో పోకెమాన్ గో ఆడొద్దంటూ రియో ఒలింపిక్స్ నిర్వాహకులు హెచ్చరకలు జారీ చేశారు. ఈ గేమ్ బాధితులలో జపాన్ స్టార్ అథ్లెట్, ఆరుసార్లు చాంపియన్ అయిన కోహియి యుచిముర చేరిపోయాడు. పోకెమాన్ గో ఆడినందుకు ఏకంగా రూ. 3.29 లక్షలకు పైగా ఫోన్ బిల్లు వచ్చింది. దీంతో జపాన్ అథ్లెట్ లబోదిబోమన్నాడు.

ఫోన్  బిల్లు చూసి తన కళ్లు బైర్లు కమ్మాయని బాధిత అథ్లెట్ యుచిముర అంటున్నాడు. దేశంలో ఉన్నట్టు ఇంటర్ నెట్ డాటా ఛార్జీలు ఉంటాయని భావించి ఇక్కడికి వచ్చిన రోజు గేమ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అప్పటినుంచి గేమ్ ఆడుతున్నానని చెప్పాడు. అయితే బిల్లు చెక్ చేసుకోగా తన కళ్లను తానే నమ్మలేకపోయానని భారీగా బిల్లు వచ్చిందని తెలిపాడు. తాను వాడుతున్న సిమ్ కంపెనీని సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పి బిల్లు తగ్గించేలా చూడాలని అభ్యర్థించగా... కంపెనీ వారు రోజుకు రూ.1800 చెల్లించాలని సూచించారు. దీంతో తనకు మళ్లీ ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించిందని యుచిముర వివరించాడు.

Advertisement
Advertisement