వందేళ్లలోనే అశ్విన్‌ అరుదైన అద్భుత రికార్డు!

12 Oct, 2016 09:17 IST|Sakshi
వందేళ్లలోనే అశ్విన్‌ అరుదైన అద్భుత రికార్డు!

స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలికాలంలో బంతిని అద్భుతంగా గింగిరాలు తిప్పుతూ.. ప్రత్యర్థులను చిత్తుచేసిన ఈ మేటి బౌలర్‌ తాజాగా న్యూజిల్యాండ్‌ సిరీస్‌లోనూ  సత్తా చాటాడు. ఇండోర్‌లో న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడో  టెస్టులో ఏకంగా 13వికెట్లు పడగొట్టి.. కెరీర్‌లోనే ఉత్తమ గణాంకాలు (13/140) నమోదు చేశాడు. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన ఈ స్పిన్నర్‌..  రెండో ఇన్నింగ్స్‌లో చివరి వికెట్‌ రూపంలో ట్రెంట్‌ బౌల్ట్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక అశ్విన్‌ సాధించిన అరుదైన రికార్డు ఏమిటంటే.. గత వందేళ్లలో ఏ బౌలర్‌ సాధించిన స్ట్రైక్‌ రేట్‌ను అశ్విన్‌ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 100 వికెట్లకుపైగా పడగొట్టిన బౌలర్లలో ఈ 30 ఏళ్ల ఇంజినీర్‌ ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. టెస్టుల్లో అశ్విన్‌ స్ట్రైక్‌ రేట్‌ 49.4 కావడం గమనార్హం. ఒక వికెట్‌ పడగొట్టడానికి బౌలర్‌ వేసే బంతులను బట్టి అతని స్ట్రైక్‌ రేట్‌ను నిర్ధారిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. తాను వేసిన ప్రతి 50 (49.4) బంతులకు అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొడుతూ వచ్చాడు.

టెస్టుల్లో స్ట్రైక్‌ రేట్‌ పరంగా చూసుకుంటే గత వందేళ్లలో అశ్విన్‌ టాప్‌ స్థానంలో నిలువగా.. అతని తదుపరి స్థానంలో మెక్‌గిల్‌ (ఆస్ట్రేలియా) 54 స్ట్రైక్‌ రేటుతో, ఆ తర్వాతిస్థానంలో మురళీధరన్‌ 55 స్ట్రైక్‌రేటుతో ఉన్నారు. టాప్‌-10లో ఉన్న శ్రీలంక బౌలర్‌ రంగనా హెరాత్‌, ఆస్ట్రేలియా బౌలర్‌ నాథన్‌ లియన్‌ మాత్రమే ప్రస్తుతం ఆడుతున్న అశ్విన్‌ సమీకాలికులు. ఈ జాబితాలో భారత బౌలర్‌ బీఎస్‌ చంద్రశేఖర్‌ 13వ స్థానంలో ఉండగా, ఆయన తర్వాతి స్థానంలో అనిల్‌ కుంబ్లే ఉన్నారు.

ఇక ఆల్‌టైమ్‌ టెస్టు చరిత్ర ప్రకారం చూసుకుంటే 1910లో క్రికెట్‌ ఆడిన ఇంగ్లిష్‌ బౌలర్లు జానీ బ్రిగ్స్‌, కొలిన్‌ బ్లైత్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మూడో స్థానంలో అశ్విన్‌ నిలిచాడు. ఇక టెస్టు క్రికెట్‌లో బౌలింగ్‌ దిగ్గజాలుగా భావించే మురళీధరన్‌, షేన్‌ వార్న్‌ ఈ జాబితాలో ఐదు, ఆరు స్థానాల్లో ఉండగం గమనార్హం.

మరిన్ని వార్తలు