14ఏళ్ల బాలికపై మూడురోజులుగా గ్యాంగ్ రేప్

1 Feb, 2014 15:39 IST|Sakshi

పశ్చిమబెంగాల్ దారుణాన్ని ఇంకా మర్చిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలాంటిదే మరో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఓ 14ఏళ్ల విద్యార్థినిపై ఐదుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా మూడు రోజుల పాటు పలుమార్లు వారు ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని మావానా ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

 

బుధవారంనాడు మార్కెట్కు వెళ్లిన విద్యార్థినిని ఐదుగురు యువకులు బలవంతంగా ఇంచులై ప్రాంతంలోని అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను ఓ రబ్బర్ ట్యూబ్తో కట్టిపడేసి, మత్తుమందు ఇచ్చి ఒకరి తరువాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం మొదలుపెట్టిన ఈ కీచకపర్వాన్ని శుక్రవారం వరకు కొనసాగించారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో బాలికను వారు శుక్రవారం నాడు ఆమె ఇంటి సమీపంలో  వదిలివెళ్లారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు అంజాద్,  మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు ముందు తనను నిందితుడు అంజాద్ అసభ్యకరమైన పదజాలంతో దూషించినట్టు చెప్పింది. కాగా, వైద్య పరీక్షలో కూడా ఆమె అత్యాచారానికి గురైనట్టు నిర్థారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు