ఐఎస్‌ఐఎస్ కుట్ర భగ్నం

6 Feb, 2016 02:59 IST|Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి: ఐఎస్‌ఐఎస్ తీవ్రవాద ముఠాతో సంబంధాలున్న 13 మందిని బెంగళూరు పోలీసులు గత నెల అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు కావడం కలకలం రేపింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు ఈ విషయాన్ని బైటపెట్టారు. రిపబ్లిక్ డే ఉత్సవాల నేపథ్యంలో తీవ్రవాదుల ఉనికి కారణంగా ఎన్‌ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిఘా పెట్టారు.  దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఐఎస్‌ఐఎస్‌కు చెందిన 13 మంది తీవ్రవాదులు పట్టుబడ్డారు.

పట్టుబడిన వారిలో ఇద్దరు చెన్నై సమీపం గుమ్మిండిపూండి, కోయంబత్తూరుకు చెందిన వారుగా అధికారుల విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు ఆసిఫ్ ఆలీ అలియాస్ అర్మాన్ సానిన (21). ఇతను కోయంబత్తూరులో ప్లస్‌టూ వరకు కోయంబత్తూరులో చదివి ఆ తరువాత కుటుంబంతో సహా బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే గుమ్మిడిపూండికి చెందిన మహ్మద్ అబ్దుల్ అకద్ అలియాస్ సల్మాన్ (46) చెన్నైలో డిగ్రీ పూర్తిచేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇతని కుటుంబికులు గుమ్మిడిపూండిలోనే నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ గత నెల 22వ తేదీన బెంగళూరులో అరెస్టయ్యారు. ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు తమ విధ్వంసాలను అమలు చేసేందుకు యువతకు గాలం వేస్తున్నారు. యువతను ముగ్గులోకి దించేందుకు ఐఎస్‌ఐఎస్ భారత విభాగం అనే పేరుతో ముంబై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రత్యేక బృందాలు సంచరిస్తున్నాయి. పట్టుబడిన యువకులు ఐఎస్‌ఐఎస్‌లోకి మరింత మంది యువకులను ఎంపికచేయడం, డబ్బు వసూలు చేయడం వంటి బాధ్యతలను అప్పగించింది.

ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలకు కేంద్రస్థానమైన సిరియా నుంచి భారత్‌లోని యువకులను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సంప్రదిస్తుంటారు. అలాగే ఏకే 47, బాంబుల తయారీ ప్రయోగం తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారానే శిక్షణనిస్తున్నారు. ఇందుకోసం సాంకేతిక డిప్లొమో హోల్డర్లు, డిగ్రీలను పొందిన యువకుల పైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుని ఉన్న ఈ 13 మంది  కొన్ని నెలల క్రితం లక్నోలో సమావేశమై విధ్వంస రచన చేశారు.

పట్టుబడిన ఇద్దరు తమిళనాడు యువకులు తమ తోటివారితో కలిసి చెన్నైలో రహస్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని విధ్వంసాలకు కుట్రపన్నేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తీవ్రవాదుల కదలికలపై తీవ్రస్థాయిలో నిఘాపెట్టిన ఎన్‌ఐఏ కళ్లలో పడి కటకటాల పాలయ్యారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న చెన్నై యువకుడు సూడాన్‌కు వెళ్లి తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నట్లు కనుగొన్నారు. ఈ యువకుడిని సైతం గత ఏడాది డిసెంబరులో అరెస్ట్ చేయగా, రెండు నెలల్లోపే మరో ఇద్దరు తమిళనాడు యువకులు పట్టుబటడం ఆందోళనకరంగా పరిగణిస్తున్నారు.
 
కోవైలో మావోల కదలికలు: ఇదిలా ఉండగా కోయంబత్తూరులో 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం నుంచి వాహనాల తనిఖీ తీవ్రతరం చేశారు. కోవై తొండాముత్తూరు సమీపం అట్టుకల్ కొండప్రాంత గ్రామాల్లో మావోయిస్టుల కదలికలున్నట్లు పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

నక్సలైట్ల నిరోధక విభాగ పోలీసులు, ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా పోలీసులు, క్యూబ్రాంచ్ పోలీసులు, అటవీ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో కూంబింగ్ ప్రారంభించారు. రెండు రోజుల క్రితం సుమారు 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులు చేతపట్టి కొండల్లోకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాల తనిఖీని కట్టుదిట్టం చేశారు. కోవై మీదుగా కేరళ రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించే మార్గాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

>
మరిన్ని వార్తలు